ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్..ధోనీసేనతో ఆరెంజ్‌ ఆర్మీ ఢీ…!

-

ఐపీఎల్ మరో ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌కి రెడీ అయింది. ఈ సీజన్‌లో ఫామ్‌ లేక నానా తంటాలు పడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పటిష్టమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో జట్ల స్థానాలు ఒక్క మ్యాచ్‌తోనే తలకిందులు అవుతున్నాయి. ఏ మ్యాచ్‌ ఓడినా పాయింట్స్‌ టేబుల్‌లోకి కిందకు రావడం ఖాయం. దీంతో ఇక నుంచి ప్రతి టీమ్‌కి ప్రతి మ్యాచ్‌ కీలకమే. గత మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నై, హైదరాబాద్‌ ఎలాగైనా పోటీలోకి రావాలని భావిస్తున్నాయ్‌.

ఈ లీగ్‌లో మూడు సార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై ఈ సీజన్‌లో దారుణంగా ఆడుతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు ఓడిపోయి.. పాయింట్స్‌ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల కోసం నానా తంటాలు పడుతోంది. బ్యాటింగ్‌లో మెరుపులేమీ కన్పించడం లేదు. షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌ తప్ప బ్యాటింగ్‌లో రాణించే వారే కరువయ్యారు.మిడిలార్డర్‌ చాలా వీక్‌గా ఉంది. రైనా లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన రాయుడు పూర్తిగా టచ్‌లోకి రాలేదు. రాయుడు ఫామ్‌లోకి వస్తే చెన్నై బ్యాటింగ్‌ కష్టాలు తీరుతాయ్‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏడు మ్యాచ్‌ల్లో మూడింటింలో గెలిచి.. నాలుగు గేమ్స్‌లో ఓడిపోయింది. మ్యాచ్‌ ఆసాంతం రాణిస్తున్నా.. కీలక సమయాల్లో తప్పు చేసి ఓటమి పాలవుతోంది హైదరాబాద్. రాజస్థాన్‌ మ్యాచ్‌లో ఇలాంటి తప్పులే చేసి మ్యాచ్‌ను పొగొట్టుకుంది. ఈ సారి అలాంటి తప్పులు రిపీట్‌ చేయకూడదని భావిస్తోంది. వార్నర్‌, బెయిర్‌ స్టో, విలియమ్సన్‌, మనీష్ పాండేలతో బ్యాటింగ్‌ స్ట్రాంగ్‌గానే ఉంది. బ్యాట్స్‌మెన్‌ రాణిస్తున్నా.. ఇంకా దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది. బెయిర్‌ స్టో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ధోనీసేన గెలిచి ఫామ్‌లోకి వస్తుందా..? ఆరెంజ్‌ ఆర్మీ తన సత్తా చాటి పాయింట్స్‌ టేబుల్‌లో దూసుకెళ్తుందా..? రెండు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో ఈ ఫైట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news