రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుది మూడు దశాబ్దాల అనుబంధం. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే మండవను, తుమ్మలను ఆహ్వానించినా వారిద్దరు టీడీపీలోనే ఉన్నారు. చివరకు తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక తుమ్మల టీఆర్ఎస్లో చేరారు. ఇక మండవ చాలా రోజుల పాటు టీడీపీలోనే ఉండి… చివరకు 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తోన్న కేసీఆర్ కుమార్తె కవితకు తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించే కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు.
ఆయన పార్టీలో చేరి యేడాదిన్నర అవుతోంది. ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రయార్టీ లేదు. ఓ వైపు ఆయనతో పాటు పార్టీలో చేరిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి ఏకంగా రాజ్యసభ ఇచ్చారు. అయితే మండవను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆయన అనుచరుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని తెలుస్తోంది. కవిత ఎంపీగా ఓడిపోవడంతో కేసీఆర్ ముందు మండవను, సురేష్‌రెడ్డిని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సురేష్‌రెడ్డికి రాజ్యసభ ఇవ్వడంతో మండవ ఫ్యూచర్ డైలమాలో ఉంది.
టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికైన డీ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేస్తే ఆ పదవిలో మండవను పంపాలని ముందు అనుకున్నారు. అయితే డీఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నా రాజ్యసభ పదవిని మాత్రం వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. మండవ కూడా కొద్ది రోజులుగా పార్టీలో యాక్టివ్‌గా ఉండడం లేదు. సైలెంట్‌గానే ఉంటున్నారు. మండవకు పదవి వస్తుందన్న ఆశలు, అంచనాలు కూడా కనుచూపు మేరలో కనపడడం లేదు. దీంతో మండవపై పార్టీ మారాలని అనుచరుల నుంచి ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయంటున్నారు. కేసీఆర్ ఆయన భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆయన కారు దిగే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి.
ఇక మండవ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలోకి వెళితేనే మంచిదని ఆయన సన్నిహితులు చూసిస్తున్నారట. మండవ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. పైగా నిజామాబాద్‌లో బీజేపీ ఇప్పటికే స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పార్టీ ఎంపీ అర్వింద్ అక్కడ ఉన్నారు. మండవ చేరితే కేవలం నిజామాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో కమ్మ వర్గంలో కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది. మరి మండవ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.