ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన ఖాతాదారుల కోసం కొత్త వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈపీఎఫ్‌వో ఖాతాదారులు వాట్సాప్ ద్వారా కూడా సేవలను పొందేందుకు హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోని అన్ని పీఎఫ్ రీజనల్ ఆఫీసుల్లోనూ ఈ హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.
ఈపీఎఫ్‌వో ఖాతాదారులు వాట్సాప్ ద్వారా సేవలను పొందాలంటే తమ పీఎఫ్ రీజనల్ ఆఫీస్‌కు చెందిన వాట్సాప్ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని దానికి వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపడం ద్వారా సేవలను పొందవచ్చు. మొత్తం 138 రీజనల్ ఈపీఎఫ్‌వో ఆఫీస్‌లకు ఒక్కో వాట్సాప్ నంబర్‌ను కేటాయించారు. కనుక ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ ఉన్న రీజనల్ ఆఫీస్‌కు చెందిన వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌కు మెసేజ్‌లు పంపాల్సి ఉంటుంది.
ఇక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా ఖాతాదారులు గ్రీవెన్స్ ఫైల్ చేయవచ్చు. ఇతర సేవలు, సందేహాలకు చెందిన వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఖాతాదారులు తమ రీజనల్ ఆఫీస్‌కు చెందిన వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను తెలుసుకోవాలంటే ఈపీఎఫ్‌వో ఇండియా.గవ్.ఇన్ సైట్‌ను సందర్శించాలి. అందులో అన్ని రీజనల్ ఆఫీస్‌లకు చెందిన వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్లను పొందు పరిచారు. వాటి సహాయంతో ఈపీఎఫ్‌వో ఖాతాదారులు వాట్సాప్‌లో సేవలను పొందవచ్చు.