ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసరుతోంది. అనేక దేశాల్లో సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ కూడా నడుస్తోంది. అయితే కొందరు వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను టార్గెట్ చేశారని.. దీంతో వారికి కరోనా వైరస్ ఉన్న లెటర్లను పోస్టులో పంపుతున్నారని ఇంటర్‌పోల్ హెచ్చరించింది. మొత్తం 193 సభ్య దేశాలకు ఇంటర్‌పోల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా దేశాల్లో భారత్ కూడా ఉంది.
ఇంటర్ పోల్ హెచ్చరికల నేపథ్యంలో సీబీఐ స్పందించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను అలర్ట్ చేసింది. కరోనా వైరస్ ఉన్న లెటర్లను రాజకీయ నాయకులకు పంపుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే ఇలాంటి పలు కేసులను గుర్తించామని ఇంటర్‌పోల్ తెలిపింది.
కాగా భారత్‌లో శుక్రవారం వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 90 లక్షలుగా ఉంది. కొత్తగా 45,882 కేసులు వచ్చాయి. ఢిల్లీతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో దీపావళి అనంతరం నిత్యం భారీగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా లెటర్స్ విషయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.