గ్రేటర్ ఎన్నికల రాజకీయం వేడెక్కుతున్నది. నామినేషన్ల పర్వం ముగియడంతో నేతలు ప్రచార పర్వానికి రెడీ అవుతున్నారు. ప్రచార అస్త్రాలకు పదును పెడుతున్నారు. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అసంతృప్తులను కలుపుకొని ప్రచారాన్ని హోరెత్తించేందుకు వ్యూహాలను పన్నుతున్నారు. ఏలాగైనా మెజార్టీ సీట్లు దక్కించుకొని మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో గ్రేటర్లో వార్ మొదలైంది.
ఇక ప్రచారంలో గులాబీ దళం తనదైన శైలిలో దూసుకెళ్లేందుకు వ్యూహాలను రచిస్తున్నది. ఇప్పటికే టికెట్ల కేటాయింపులో సగం విజయం సాధించింది. అసంతృప్తులకు తావు లేకుండా సామాజిక సమతూకం పాటించింది. అక్కడక్కడా అసంతృప్తుల సెగ తగిలినా వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నది.
అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించింది. సగం కంటే ఎక్కవ సీట్లను మహిళలకే కేటాయించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ శనివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు అన్ని వార్డుల్లో ప్రచారం ఉండెలా ప్లాన్ చేశారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులతో కలిసి రోడ్‌షో నిర్వహించనున్నారు. అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా అంటూ ప్రచారం దూసుకుపోనున్నారు.
ఇక బీజేపీలో ప్రచారంలో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. టికెట్ల కేటాయంపులో అక్కడక్కడా అసంతృప్తి సెగలు తగిలినా వాటిని అధిగమించి ప్రచార పర్వంపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలు కమలం పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడానికి నేతలు క్యూకడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మేయర్ పీఠాన్ని దక్కించుకేందుకు గులాబీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, హైరాబాద్‌లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని వారికి సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా తన ప్రచారంలో వరదలు, అభివృద్దిపైనే పోకస్ చేయనున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నది. టికెట్ దక్కని కొందరు అసంతృప్త నేతలు ఆ పార్టీని వీడుతున్నా, ప్రచారంలో ఎలా ముందుకెళ్లాన్న దానిపై దృష్టి సారించింది.