రజనీకాంత్ ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా ? కబాలి కార్యాచరణ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది దీని పైనే పెద్ద కన్‌ఫ్యూజన్ కొనసాగుతుంటే… మరోవైపు కమల్ హాసన్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో రజనీ మద్దతు కోరతానంటున్నారు కమల్. మరికొద్ది రోజుల్లో తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ సమరంలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.
వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు కోరతానన్నారు.. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నానన్న కమల్.. తన మిత్రుడు రజనీకాంత్ ఇంటిని వదిలేస్తానా? అంటూ వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అధికారి సంతోష్‌బాబు.. కమల్ పార్టీలో చేరిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
సినిమాల్లో తాను, రజనీ పోటీదార్లం మాత్రమేనని, ఒకరిపై ఒకరికి ఎప్పుడూ ఈర్ష్య, అసూయ లేవని స్పష్టంచేశారు కమల్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కన్నా.. ఆయన ఆరోగ్యంపైనే తన అటెన్షన్ ఉందన్నారు. ఇటీవల రజనీకాంత్ తన అభిమానులతో సమావేశమై.. తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి…
రజనీకాంత్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో, లేదో ఇంకా క్లారిటీ రానప్పటికీ.. ఒకవైపు కమల్‌హాసన్, మరోవైపు కమలనాధులు.. ఆయనతో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి, కబాలి ఎటు వైపు చూస్తారో ఇంకా క్లారిటీ రావడంలేదు. అసలు ఎన్నికల బరిలో నిలుస్తారో, లేదో అన్నది కూడా ఎటూ తేల్చకుండా అభిమానుల్ని టెన్షన్ పెడుతున్నారు సూపర్ స్టార్.
మరో వైపు కాంగ్రెస్ కూడా తమిళనాడు పొత్తుల పై అలెర్టయింది.మిత్రపక్షమైన డీఎంకే చీఫ్ స్ఠాలిన్ తో చర్చలకు సిద్దమైంది.కాంగ్రెస్ తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ దినేశ్ గుండురావు తమిళనాడు పీసీసీ చీఫ్ తో కలిసి స్టాలిన్ ని కలిశారు తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు.