టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెలి కమ్యూనికేషన్స్ రంగంలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఒకప్పుడు మనం గంటల వ్యవధిలో చేసే పనిని ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చేసుకోగలుగుతున్నాం. ఇక ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు ఊర్లో ఎక్కడో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి చేతిలో రెండేసి స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఇదంతా టెక్నాలజీ చలవే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే టెలికాం రంగంలో ఒకప్పుడు కేవలం 2జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఏకంగా 5జి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
అయితే 5జి వస్తోంది, బాగానే ఉంది. అందులో భాగంగానే కంపెనీలు కూడా 5జి స్మార్ట్ ఫోన్లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఆ 5జి ఫోన్లను ఇప్పుడే కొనాలా ? అవి మనకు అవసరమా ? ఇంకొంత కాలం ఆగాలా ? అంటే.. నిజానికి 5జి మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనూ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. టెక్నాలజీకి మారుపేరుగా చెప్పుకునే జపాన్ దేశంలో 5జి ఉంది. కానీ అంతటా విస్తరించలేదు. ఇక ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 5జి సేవలను ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నారు. ఇక భారత్‌లో 5జి కోసం కావల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. పలు టెలికాం కంపెనీలు కొన్ని చోట్ల 5జిని టెస్ట్ చేస్తున్నాయి. అందువల్ల మన దేశానికి వస్తే 5జి వచ్చేందుకు ఎంత లేదన్నా కనీసం ఇంకో 2 నుంచి 3 ఏళ్ల వరకు సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే మరి 5జి ఫోన్లు కొనాలా.. అంటే లేదు.. వాటిని ఇప్పుడే కొనాల్సిన పనిలేదు. ఎందుకంటే.. 5జి ఇంకా రానేలేదు. అందుకు 2 ఏళ్లన్నా టైం పడుతుంది. కనుక 5జి ఫోన్‌ను కొన్నా అప్పటి వరకు ఆగాల్సిందే. అయితే అప్పటి వరకు 5జి ఫోన్లు ఇంకా తక్కువ ధరలకే లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5జి ఫోన్‌కు కనీసం రూ.25వేలు అయినా పెట్టాల్సి వస్తోంది. కానీ 2 ఏళ్లకు ఈ ధర ఇంకా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఏరకంగా చూసినా 5జి ఫోన్లు మనకు ఇప్పుడే అవసరం లేదు. 4జి ఫోన్లు ఇంకో 2 ఏళ్ల వరకు భేషుగ్గా నడుస్తాయి. కనుక కంపెనీలు 5జి అని ఎంత ఊదరగొట్టినా టెంప్ట్ కాకండి. అనవసరంగా డబ్బులు ఖర్చవుతాయి తప్ప 5జి ఫోన్లను ఇప్పుడు కొన్నా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు..!