అసలే చలికాలం.. మూగజీవాలు ఏం చేస్తాయో..?

-

ప్రతి ఏడాది చలి తీవ్రత విపరీతంగా పెరుగుతూ వస్తోంది. కొంచెం చలి వస్తే చాలు మనుషులే ముడుచుకుపోతాం. చలిని తట్టుకోవడాని అనేక సాధనాలను సిద్ధం చేసుకుంటాం దుప్పట్లు, స్వెట్టర్లు వేసుకుని చలి నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటాం. మరీ చలి తీవ్రత ఎక్కువైతే చలి మంట వేసుకుని వెచ్చదన్నాన్ని పొందుతాం. చలి నుంచి కాపాడుకోవడానికి మనకు దారులెన్నో.. అదే మూగజీవాల పరిస్థితి. ఎప్పుడైనా ఆలోచించారా.. చలి నుంచి మూగజీవాలు ఎలా తప్పించుకుంటాయోనని..? వెచ్చదనం కోసం జంతువులు ఏం చేస్తాయో తెలుసుకుందాం రండి.

Stork
Stork

దూర ప్రాంతాలకు వలస..
చలి తట్టుకునేందుకు కొన్ని జంతువులు, పక్షులు వలసలు వెళ్తుంటాయి. జంతువుల కన్నా.. పక్షులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి. శీతాకాలంలో ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. శీతాకాలంలో సైబీరియా దేశం నుంచి వేలాది కొంగలు తెలుగు రాష్ట్రాలకు రావడం చూస్తూనే ఉంటాం. ఏపీలోని ఏలూరు సమీపంలో ఉన్న కొల్లేరు సరస్సు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లికి ఈ కొంగలు వలస వస్తుంటాయి.

ఈ కొంగలు జనవరి వరకు తన సంతానాన్ని వృద్ధి చేసుకుని వేసవికాలం పూర్తయిన తర్వాత తిరిగి తమ దేశానికి పయనమవుతుంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల జంతువులు, పక్షులు వలస వెళ్తుంటాయి. చలితీవ్రతకు చేపలు కూడా దక్షిణం వైపు లేదా నీటి లోతుకు వెళ్తుంటాయట. కెనడాలోని కొన్ని రకాల సీతాకోక చిలుకలు శీతాకాలంలో మెక్సికోకు వెళ్తాయంట.

monkey
monkey

పరిస్థితులకు అనుగుణంగా కొన్ని జంతువులు రూపాంతరం చెందుతుంటాయి. చలిని తట్టుకోవడానికి శరీరంపై దళసరి వెంట్రుకలను పెంచుకుంటాయి. వెచ్చగా ఉండేందుకు చెట్ల రంధ్రాలు, రాళ్ల కింద కాలం వెళ్లదీస్తాయి. శీతాకాలంలో ఆహారం దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే ఉడతలు, ఎలుకలు వంటివి ముందుగానే ఆహారాన్ని సేకరించుకుని దాచిపెట్టుకుంటాయి. మరికొన్ని జంతువులు కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటాయి.

వలస వెళ్లడానికి ఆస్కారం లేని జంతువులు శీతాకాలంలో నిద్రాణస్థితిలోకి వెళ్లిపోతాయి. సురక్షితమైన చోటును ఎంచుకుని అక్కడే శీతాకాలం ముగిసే వరకు నిద్రపోతూనే ఉంటాయి. ఈ సమయంలో జంతువులు ఆహారం తినవు కాబట్టి.. శరీర ఉష్ణోగ్రత, శ్వాసప్రక్రియను తగ్గించి శక్తిని ఆదా చేసుకుంటాయి. నిద్రాణస్థితిలో వెళ్లకన్న ముందే ధ్రువపు ఎలుగుబంట్లు, గబ్బిలాలు తమ ఆహారాన్ని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటాయి. అలా శీతాకాలంలో ఆహారం తినకుండా బతికేస్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news