ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. అయితే ఆయన ఢిల్లీ వెళుతున్నారా లేక ఢిల్లీ నుంచి ఆయనకు పిలుపు వచ్చిందా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు సాయంత్రం 9 గంటలకు జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు అలాగే బాధితులకు సత్వరమే సాయం అందించాలని జగన్ అమిత్ షాను కోరనున్నట్లు సమాచారం. అయితే రాజకీయ పర్యటన ఏమీ కాదని కేవలం సాయం కోసమే కేంద్రానికి వెళుతున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా ఈ పర్యటనలో రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే మొన్న రైతులు భారత్ బంద్ చేసిన సమయంలో వారికి వైసిపి కూడా మద్దతు ఇచ్చింది. ఒకవేళ ఆ విషయం మీద మాట్లాడాలని జగన్ ని పిలిపించారా ? అనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి తమ రైతు చట్టాల వలన ఎటువంటి లోటు పాట్లు లేవు అని చాటి చెప్పుకునేందుకు కేంద్ర జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంకల్పించింది. దాదాపు 700 ప్రాంతాల్లో 700 సదస్సులు నిర్వహించే ప్లాన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు గాను ఆంధ్రప్రదేశ్ లో తమ సదస్సులకు సహకరించాలని ఏపీ సీఎం జగన్ ను అమిత్ షా తనదైన శైలిలో కోరనున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్ అడిగిన వెంటనే అపాయింట్మెంట్ లభించింది అనేది తాజా సమాచారం. మరోపక్క బీజేపీ వర్గాలు అయితే జగన్ను బిజెపి పెద్దలు పిలిపించారని ఆయన అపాయింట్మెంట్ కోరడం నిజం కాదని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది.