ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు చెందిన వాట్సాప్ పే సేవలు దేశంలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో భాగస్వామ్యం అయిన వాట్సాప్ ఈ సేవలను తన యూజర్లకు అందిస్తోంది. ఆరంభంలో వాట్సాప్ పే 2 కోట్ల మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నవంబర్ నెలలో వాట్సాప్ పేకు అనుమతులు ఇచ్చిన విషయం విదితమే. అయితే వాట్సాప్ పే మొదటి దశలో కేవలం 2 కోట్ల మంది యూజర్లకే సేవలను అందించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మాట్లాడుతూ.. దేశంలో రోజు రోజుకీ యూపీఐ ద్వారా చెల్లింపులు ఎక్కువవుతున్నాయని అన్నారు. వాట్సాప్‌లో యూజర్లకు పేమెంట్ సేవలను అందించడం సంతోషంగా ఉందన్నారు.
కాగా రెడ్‌సీర్ అనే రీసెర్చ్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 2025 వరకు డిజిటల్ పేమెంట్లు 94 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ పే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎంలకు గట్టి పోటీనివ్వనుంది.