దెయ్యాల కథలను ఇప్పటి వరకు మనం పుస్తకాల్లో చదువుకున్నాం. సినిమాలు, సీరియల్స్‌లో దెయ్యాలను చూశాం. కానీ దెయ్యాలను నిజంగా చూసిన వారు లేరు. అసలు అవి ఉన్నాయా, లేవా.. అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికీ దెయ్యం అనే పేరు చెప్పగానే తీవ్రంగా భయపడిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే పురాతన బంగళాలు, మర్రి చెట్లు, నిర్మానుష్య ప్రాంతాలు, శ్మశానాల్లో దెయ్యాలు ఉంటాయని మనం ఇప్పటి వరకు సినిమాలు, పుస్తకాల్లో తెలుసుకున్నాం. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్లో దెయ్యం తిరుగుతుందని పుకారు ఉంది. దీంతో ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయింది.
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఉన్న బెగన్ కోడార్ అనే గ్రామంలో రైల్వే స్టేషన్ ఉంది. 1960లలో అక్కడ సంతల్ తెగకు చెందిన లచన్ కుమారి అనే రాణి రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం తనకున్న భారీ స్థలంలో కొంత స్థలాన్ని భారతీయ రైల్వేకు విరాళంగా ఇచ్చింది. తరువాత రైల్వే స్టేషన్ నిర్మించారు. రైళ్లు ఆగేవి. కానీ 1967లో ఆ రైల్వే స్టేషన్‌కు చెందిన మాస్టర్ విచిత్రంగా చనిపోయాడు. ముందు రోజు రాత్రి ఆ స్టేషన్‌కు సమీపంలోని రైలు పట్టాలపై అతను ఒక తెల్ల చీర ధరించిన మహిళను చూశాడని, తరువాత రోజు అతను చనిపోయాడని స్థానికులు తెలిపారు. దీంతో ఆ రైల్వే స్టేషన్ కాస్తా దెయ్యాల స్టేషన్ గా మారింది. తరువాత అక్కడ రైళ్లను ఆపలేదు.
అయితే 2007లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ చొరవతో ఆ స్టేషన్‌ను మళ్లీ ఓపెన్ చేశారు. అయినపప్పటికీ ఆ స్టేషన్లో ఇప్పటికీ పర్మినెంట్ సిబ్బంది లేదు. సిబ్బంది ఉదయం పూజ చేశాకే స్టేషన్ లోపలకి వస్తారు. 1950లలో ఉపయోగించిన టిక్కెట్లనే ఇప్పటికీ అక్కడ ఇస్తున్నారు. నిత్యం ఆ స్టేషన్లో పగలి పూటే రైళ్లు ఆగుతాయి. 5 రైళ్లు అక్కడ ఆగుతాయి. చివరి రైలు సాయంత్రం 5.45 గంటకు ఆగుతుంది. తరువాత అక్కడ ఎవరూ ఉండరు. నిత్యం 800 మంది ప్రయాణికులు ఈ స్టేషన్లో దిగుతుంటారు. ఇక సాయంత్రం 6 తర్వాత అక్కడ ఎవరూ కనిపించరు. ఆ స్టేషన్ లో అందరూ కాంట్రాక్టు సిబ్బందే ఉంటారు. అక్కడ టిక్కెట్లు అమ్మేవారికి ఒక టిక్కెట్‌పై రూ.1 కమిషన్ ఇస్తారు. ఇలా ఆ స్టేషన్ నడుస్తోంది.
అయితే అది దెయ్యాల స్టేషన్‌గా పేరు గాంచడంతో దాన్ని చూసేందుకు కూడా కొందరు నిత్యం అక్కడికి వెళ్తుంటారు. ఇక స్టేషన్లో గోడలపై హిందూ దేవుళ్లకు చెందిన ఫొటోలను ఉంచారు. దెయ్యాలు రాకుండా ఉండేందుకు అలా ఏర్పాటు చేశారన్నమాట. కాగా 2017లో కొందరు వ్యక్తులు ఆ స్టేషన్లో ఒక రాత్రి మొత్తం గడిపారు. వారిని ఆట పట్టించేందుకు కొందరు స్థానికులు దెయ్యాల్లా వేషాలు వేసుకుని వచ్చారు. కానీ వారి ముందు ఆ స్థానికుల ఆటలు సాగలేదు. తరువాత వారు తెల్లారాక బయటకు వచ్చి తమకు దెయ్యాలు కనిపించలేదని చెప్పారు. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ అక్కడ దెయ్యాలు కనిపిస్తాయని చెబుతుంటారు. ఏది ఏమైనా ఆ స్టేషన్ మాత్రం దెయ్యాల రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది.