నూతన సంవత్సరం సందర్భంగా జియో తన కస్టమర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్‌ను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇకపై దేశంలో జియో నుంచి ఇతర ఏ నెట్‌వర్క్‌కు అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా వాయిస్ కాల్స్‌ను ఉచితంగా చేసుకోవచ్చని ప్రకటించింది. జియో ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
కాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతంలో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జిలను వసూలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జియో కూడా తన కస్టమర్ల నుంచి స్వల్ప మొత్తంలో చార్జిలను వసూలు చేసింది. అందుకనే కేవలం జియో టు జియో కాల్స్ మాత్రమే కస్టమర్లకు ఇప్పటి వరకు ఉచితంగా వచ్చాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు జియో స్వల్ప చార్జిలను వసూలు చేస్తూ వచ్చింది. అయితే జనవరి 1, 2021 నుంచి ట్రాయ్ ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జిలను రద్దు చేయాలని నిర్ణయించడంతో అదే తేదీ నుంచి జియో తన కస్టమర్లకు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచిత కాల్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని జియో తెలియజేసింది.
ఈ క్రమంలో జియో కస్టమర్లు మళ్లీ ఎప్పటిలాగే ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచిత కాల్స్‌ను చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే జియో టు జియో ఉచిత కాల్స్ ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం ఎంతో మంది జియో కస్టమర్లకు మేలు చేయనుంది. అయితే ఈ విషయంపై తాము ఇది వరకే స్పష్టతనిచ్చామని, ట్రాయ్ ఆ చార్జిలను రద్దు చేసిన మరుక్షణమే తాము ఇతర నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని మళ్లీ అందుబాటులోకి తెస్తామని గతంలోనే చెప్పామని, చెప్పిన ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చామని జియో తెలియజేసింది. తాము కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడంతోపాటు ప్రతి కస్టమర్‌కు సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని జియో ప్రకటనలో తెలియజేసింది.