ఇప్పటికే ఒకపక్క కరోనా టెన్షన్ పెడుతోంటే మరో పక్క దేశంలో బర్డ్ ఫ్లూ కూడా ఎంటర్ అయింది. ఏకంగా నాలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. కేరళలోని కొట్టాయం, అలప్పుజా జిల్లాలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని పాంగ్ డ్యాం లేక్ లో వలస పక్షులు మృతి చెందాయి.
కాంగ్రా జిల్లాలో ఉన్న ఈ డ్యాం వద్ద ఏకంగా 1800 పక్షులు మృతి చెందాయి. దీంతో ఆ డ్యాంకు పది కిలోమీటర్ల దాకా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అంతే కాక హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని అన్ని పౌల్ట్రీ మార్కెట్ లు మూసివేశారు. గుడ్లు, మాంసం ఉత్పత్తుల మీద నిషేధం కూడా విధించారు. మొత్తం మీద ఇప్పట్లో జనాన్ని ఈ వైరస్ ల బెడద వదిలేట్టు మాత్రం కనిపించడం లేదనేది అర్ధం అవుతోంది.