కేంద్ర ప్రభుత్వం జనవరి 16వ తేదీ నుంచి దేశంలోని ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్న విషయం విదితమే. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి ఆ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చింది.
బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ఆ వ్యాక్సిన్‌ను మన దేశంలో పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతి కూడా లభించింది. ఇక తాజాగా కేంద్రం కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలుకు ఎస్ఐఐకి ఆర్డర్ కూడా ఇచ్చింది. దీంతో ఎస్ఐఐ ఒక్కో వ్యాక్సిన్ డోసును రూ.200కు కేంద్రానికి ఇవ్వనుంది.
వచ్చే వారంలో ఎస్ఐఐ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కేంద్రానికి పంపిణీ చేయనుంది. మొదటి దశలో 10 కోట్ల డోసులను ఎస్ఐఐ సరఫరా చేయనుంది. ఆ వ్యాక్సిన్ డోసులను కేంద్రం నేరుగా రాష్ట్రాలకు నిర్దిష్టమైన పరిమాణంలో పంపుతుంది. రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పంపిణీ కేంద్రాల నుంచి జిల్లాలకు అక్కడి నుంచి వ్యాక్సిన్ కేంద్రాలకు వ్యాక్సిన్లు వెళ్తాయి. ముందుగా తొలి విడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.