మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 94వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రాజధానిలోని రాష్ట్రీయ ‘స్మృతి స్థల్’ వద్ద ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు వాజ్పేయి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా సీనియర్ నేత, వాజ్ పేయీ ఆత్మీయుడు ఎల్.కె.అద్వానీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు నివాళులర్పించారు. ‘స్మృతి స్థల్’ వద్దకు వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎదురెల్లి ఆహ్వానం పలికారు.
వాజ్పేయి గౌరవార్ధం ఆయన బొమ్మతో ముద్రించిన రూ.100 నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాజ్పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం ‘సుపరిపాలన దినం’గా పాటిస్తూ ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాజ్ పేయి చిత్ర పటానికి పూల మాలలు వేసి భాజపా నాయకులు జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు.