తెలంగాణలో మావోయిస్టుల బెడదలేదనుకుంటుంటే.. కొన్ని రోజులుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వారి ప్రభావాన్ని మరోసారి చాటనున్నారు. ఎలాంటి అలజడి లేని.. హైదరాబాద్‌లో నలుగురు మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ నలుగురు మావోయిస్టులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులలో అనూష, అన్నపూర్ణ, భవాని, కొర్ర కామేశ్వరరావులుగా గుర్తించినట్లు సమాచారం. పట్టుబడ్డ నలుగురిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరు 2017 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వైజాగ్ పోలీసులు తెలిపారు. గత ఏడాది అగ్రనేత రామకృష్ణతో కలిసి పని చేశారని పేర్కొన్నారు.
మన్యంతో పాట విశాఖలో మావోయిస్టు పార్టీ బలోపేతానికి పని చేశారని పోలీసులు పేర్కొన్నారు.. పోలీసులపై దాడి చేసిన 3 ఘటనల్లో వీరు పాల్గొన్నారని, యువతను మావోయిజం వైపునకు మళ్లించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో వారి కదలికలను గమనిస్తున్న పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్లో పట్టుకోవడంతో నగరంలో ఒక్క సారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. పట్టుబడిన వారి పూర్తి స్థాయి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.