బెజవాడ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న గద్దె vs దేవినేని

-

బెజవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. బెజవాడ తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఉప్పు నిప్పుగా మారింది. జిల్లాలో 16 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే గన్నవరం, బెజవాడ తూర్పు స్థానాల్లో మాత్రం టీడీపీ గెలిచింది. ఇందులో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీకి మద్ధతు ప్రకటించగా బెజవాడ తూర్పులో గెలిచిన గద్దె రామ్మోహన్ మాత్రం ఒంటరి పోరు చేస్తున్నారు.అయితే, ఈ సీటుపై అధికార వైసీపీ సీరియస్ ఫోకస్ పెట్టింది. దేవినేని అవినాష్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె,అవినాష్ మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తుంది.

కృష్ణ జిల్లా మొత్తంలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గద్దె మాత్రమే. గత ఎన్నికల్లో గద్దెపై పోటీ చేసిన ఓడిపోయిన బొప్పన భవకుమార్ కు నగర అధ్యక్ష పదవి ఇచ్చి తూర్పు ఇన్‌ చార్జ్‌ గా దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపింది. దీంతో అప్పటి నుంచి అవినాష్, గద్దెల మధ్య వైరం ముదిరింది. వైసీపీ ఇన్‌ చార్జ్‌ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి అవినాష్ నియోజకవర్గంలో తన ముద్ర పడేలా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన గద్దెకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ప్రభుత్వంతో మాట్లాడుతూ నియోజకవర్గంలోతన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో అవినాష్, గద్దె ఇద్దరూ కలిసి టీడీపీలో పనిచేశారు. అవినాష్ తండ్రి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కాంగ్రెస్‌ నుంచి తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి రెండుసార్లు ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో టీడీపీ నుంచి ప్రధాన ప్రత్యర్థిగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. అప్పట్లో కూడా నెహ్రూ, గద్దె మధ్య నియోజకవర్గ స్థాయిలో విబేధాలున్నాయి. ఇప్పుడు అవినాష్ కు, గద్దెకు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. బెజవాడ కార్పోరేషన్‌ ఎన్నికల సమయంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయపోరు నడిచింది. అయినా టీడీపీ నుంచి 9 మంది కార్పొరేటర్లు గెలిస్తే, వైసీపీకి 14 గెలవటం ద్వారా నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నాడు అవినాష్.

కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వ్యక్తిగత దూషణలు కూడా ఇద్దరి మధ్యా నడిచాయి. తాజాగా నియోజకవర్గంలోని కృష్ణలంకలోని రిటైనింగ్ వాల్ ను 125 కోట్లతో జగన్ శంకుస్థాపన చేశారు. అయితే గతంలోనే టీడీపీ పనులు చేపట్టినా పూర్తికాలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయటానికి జగన్ సర్కారు నిధులు కేటాయించింది. అయితే గతంలో తాము చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని గద్దె విమర్శలు చేయగా పూర్తయితే వరదనీరు ఎందుకు ఇళ్లలోకి వస్తోందని అవినాష్ కౌంటర్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా ఈ ఇద్దరు నేతల మధ్య హోరాహోరి ఫైట్ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news