విశాఖలో సంచలనం సృష్టించిన ఆరు మృతదేహాల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిద్రలోనే ఓ కుటుంబం బతుకు తెల్లారిపోయింది. వివాహేతర సంబంధం ఆరుగురు ప్రాణాల్ని బలితీసుకుంది. హత్యాస్థలంలోనే ఇంకా 6 మృతదేహాలు ఉన్నాయి.మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. హత్యలు జరిగిన స్థలంలోనే పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు అప్పలరాజు స్థలంలోనే అంత్యక్రియలు చేస్తామంటున్నారు. ఒక్క తప్పు ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది.
విశాఖలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తుండగా.. పాత కక్షలతోనే అప్పలరాజు ఆరుగుర్ని చంపినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా ఈ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో బత్తెన రామారావు కుటుంబం హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు పోలీసులు.
నిందితుడు అప్పలరాజు కూతురితో రామారావు కుమారుడు విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇది తెలిసిన అప్పలరాజు 2018లో విజయ్‌పై పెందుర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అరెస్టు కూడా చేశారు. అప్పటి నుంచి విజయ్ కుటుంబంపై అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు. ఈ గొడవలతోనే విజయ్ కుటుంబం బెజవాడ వెళ్లిపోయింది. అయితే ఇటీవల ఓ శుభకార్యం కోసం బెజవాడ నుంచి స్వస్థలం జుత్తాడ వచ్చారు. తమ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో ఎప్పటినుంచో రగిలిపోతున్న అప్పలరాజు ఇదే అదనుగా భావించాడు.
అప్పలరాజు తెల్లవారుజామున విజయ్ ఇంట్లో ప్రవేశించి అతడి తండ్రి రామారావు, తల్లి, చెల్లి, భార్యతో పాటు ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా హత్య చేశాడు. ఈ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పలరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పూర్తివిరాలు బయటకు వచ్చాయి.