ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం

-

కరోనా కట్టడికి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినేట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా రేపటి (బుధవారం) నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే మే 5 నుంచి రెండు వారాల పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయగా.. వీటిని కఠినంగా అమలు చేయనున్నారు.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలానే అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు చేసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇటు సంక్షేమ పథకాలపై కూడా ఏపీ మంత్రివర్గం దృష్టి సారించింది. మే 13న రైతు భరోసా తొలి విడతలో భాగంగా 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4వేల 40 కోట్లు జమ చేయనున్నారు.ఇక మే 25న  వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా నగదు 38 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.2,805 కోట్లు జమ చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద మే 18న మరో 1లక్షా 460 కుటుంబాలకు రూ.10వేలు పరిహారం అందించనుంది. ఇక బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ విద్యా బోధన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇలా అమలు చేస్తే 2024-25 సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోనే చదువనున్నారు. మొత్తం రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు చేయనున్నారు. అర్చకుల గౌరవ వేతనం రూ.10వేల నుంచి రూ.15వేల పెంచడంతో పాటు బి కేటగిరి ఆలయాల్లో అర్చకుల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేల పెంచారు. అలానే ఇమామ్‌ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచడంతో పాటు మౌజమ్‌లకు గౌరవ వేతనం రూ.3వేల నుంచి రూ.5వేలకు పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news