దేశంలో కరోనా కేసులు భారీ నమోదవుతుండడంతో జనాల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది కిందటి నుంచి కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి జనాల్లో భయం నానాటికీ పెరుగుతోంది. అయితే కోవిడ్ మొదటి వేవ్ ముగిశాక కొద్ది నెలలు కేసులు భారీగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా ఇక తగ్గినట్లేనని సంబరపడ్డారు. కానీ వారి సంతోషం కొద్ది రోజులే ఉంది. మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ మొదలవడం, ఈసారి ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండడం, వైరస్ తీవ్రత కూడా ఎక్కువగానే ఉండడంతో జనాల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. దీంతోపాటు మానసిక సమస్యలు కూడా వారిని వెంటాడుతున్నాయి.
అసలు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతుందా ? కరోనా ఎప్పుడు అంతమవుతుంది ? ఎప్పుడు మళ్లీ ప్రజల జీవన స్థితిగతులు మళ్లీ సాధారణ రూపానికి చేరుకుంటాయి ? కోవిడ్‌కు అంతం లేదా ? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వస్తుందేమోనని భయం, వస్తే ప్రాణాపాయం ఏర్పడుతుందేమోనని భయం, దీనికి తోడు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అన్నీ సమస్యలే .దీంతో సగటు పౌరుడు తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే అలాంటి వారి కోసం నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించింది. ప్రజల్లో కరోనా భయాలు, మానసిక సమస్యలను తొలగించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చారు.
ఎన్‌బీటీ రెండు హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తేగా 8800409846 అనే నంబర్‌కు ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాల్ చేయవచ్చు. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల మధ్య 8800409359 అనే నంబర్‌కు కాల్ చేయవచ్చు. పలువురు వైద్య నిపుణులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. కరోనా చికిత్సకు వైద్య సలహాలు, సూచనలతోపాటు ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, విచారం వంటి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తారు. ఒత్తిడి లేకుండా జీవించడం ఎలాగో చెబుతారు. కనుక ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే పైన తెలిపిన నంబర్లకు ఫోన్ కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.