ఓ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ని దోషిగా కోర్టు నిర్దారించింది. జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురిని సీబీఐ ప్రత్యేక కోర్టు ఐపీసీ సెక్షన్ 302, 120బీ కింద దోషులుగా ప్రకటిస్తూ…శుక్రవారం పంచకులలోని సీబీఐ స్పెషల్ జడ్జి జగ్దీప్ సింగ్ తీర్పు వెలువరించారు. ఈ ముగ్గురికి ఆయా సెక్షన్ల ప్రకారం శిక్షను జనవరి 17న నిర్ణయిస్తామని జడ్డి తెలిపారు. డేరా బాబాతో పాటు డేరా మేనేజర్ క్రిషన్ లాల్, ఇద్దరు షూటర్లు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్ లను సీబీఐ జడ్జి దోషులుగా తేల్చారు. క్రిషన్ లాల్, కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కాగా భద్రత కారణాల వల్ల డేరా చీఫ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపర్చారు. డేరా బాబా మాజీ డ్రైవర్ ఖట్టా సింగ్ ఈ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు.
సిర్సాలో నాడు జర్నలిస్టుని చంపేయమని తన ముందే రామ్ రహీమ్ మనుషులకు చెప్పినట్టు ఖట్టా సింగ్ మే 2018లో పంచకుల సీబీఐ కోర్టులో తెలిపారు. వీటితో పాటు సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన డేరా బాబా అరాచకాలు, అక్రమ సంపాదన ఇతర అన్ని విషయాలను కోర్టు పరిగణంలోకి తీసుకుని తీర్పుని వెలువరించినట్లు తెలుస్తోంది.