రాములమ్మ దూకుడుకు కారణమేంటి?

-

హైదరాబాద్: విజయశాంతి.. లక్షల మంది అభిమానులు ఆమె సొంతం. చిన్న వయస్సులోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. సినిమా పరిశ్రమలో ఒక రేంజ్‌లో ఉన్నప్పుడే తెలంగాణ కోసం ప్రజల్లోకి వచ్చారు. ఎంపీగా తెలంగాణ కోసం పార్లమెంటు లోపల బయట విజయశాంతి పోరాటం చేశారు. అయితే తెలంగాణ బిల్లు పాసైన తర్వాత కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ను ఎదిరించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన రాములమ్మ ఓడిపోయారు.

కాంగ్రెస్‌లో కొనసాగినప్పుడు విజయశాంతి పెద్దగా యాక్టివ్‌గా ఉండలేదన్న చర్చ జరిగింది. అయితే టీకాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై పోరాటం చేయట్లేదన్న అభిప్రాయంతో విజయశాంతి బయటకు వచ్చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో విభేదించిన విజయశాంతి.. కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీలో చేరిన కొత్తల్లో నెమ్మదిగా ఉన్న రాములమ్మ తాజాగా వేగం పెంచారన్న చర్చ బీజేపీ వర్గాల్లో నడుస్తోంది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విజయశాంతి ప్రశ్నల వర్షం‌ కురిపిస్తున్నారు.

 

గతానికి భిన్నంగా విజయశాంతి క్షేత్రస్థాయిలో పర్యటనలు సైతం చేస్తున్నారు. మహిళా సమస్యలను తెలుసుకోవటంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమైన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను సైతం సందర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. విజయశాంతి యాక్టివ్ కావడంతో బీజేపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి . విజయశాంతి లాంటి నేతలు దూకుడు పెంచటం బీజేపీకి కలిసొస్తుందంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news