దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుందని నేపథ్యంలో… దేశ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తో కలిసి చర్చలు జరపగా… తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. గత కొన్ని రోజులుగా బిజెపి నేతలతో దూరం పాటిస్తున్న ప్రశాంత్ కిషోర్… కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది.
ఈ నేపథ్యం లోనే ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా… రాబోయే ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలలో… బిజెపి పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే దేశం లోని అన్నీ పార్టీలను ఏకం చేసే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్లు టాక్.