అమరావతి: ఏపీ రాజధాని ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజధాని మార్పు వంటి అంశాలు ఆమెకు తలనొప్పిగా మిగిలాయి. దీంతో ఆ నియోజకవర్గంలో ఆమె పట్టుసాధించలేకపోయారు. అటు సొంత పార్టీ నేతలతోనూ ఆమెకు విభేదాలు ఉన్నాయి. ఇక ప్రజల్లో కూడా శ్రీదేవిపై వ్యతిరేకత ఉంది. సామాజికవర్గంగా చూసుకున్నా ఆమెకు అంతగా ఆదరణ రావడంలేదట. నియోజకవర్గంలో అధిపత్యం కోసం ఆమె ఆరాట పడుతున్నారట.
ముఖ్యంగా ఇసుక మాఫీయాతో ఆమెకు సంబంధాలున్నాయని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఇక విషయాలన్నీ సీఎం జగన్ దృష్టికి వెళ్లాయట. వైద్యురాలిగా శ్రీదేవికి పేరున్నా రాజకీయ నాయకురాలిగా పెద్దగా సక్సెస్ కాలేదని భావిస్తున్నారట. రెండేళ్లలో నియోజకవర్గంలో కనీసం పట్టు కూడా పెంచుకోలేదని జగన్ దృష్టికి వెళ్లిందట. మరోవైపు ఎంపీ నందిగం సురేశ్‌తో అసలు పొసగడం లేదట. ఇక తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ బలంగా ఉన్నారట. దీంతో ఈసారి నందిగం సురేశ్ గానీ, డొక్కా మాణిక్య వరప్రసాద్ గానీ పోటీ చేయొచ్చని ఆ పార్టీ నేతలే విశ్లేషించుకున్నారు. శ్రీదేవి తీరు అధినాయకత్వానికి నచ్చడంలేదని, ఈసారి ఆమెకు టికెట్ కష్టమేనని తాడికొండలో టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.