ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ తన కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఆ సందర్భంగా వినియోగదారులకు తాజాగా తమ ఖాతాదారులకు నిబంధనలను జారీ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా బ్యాంకుకు వెళ్లకుండానే దాదాపు అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకునే సంగతి తెలిసిందే. దాదాపు ఎస్బీఐ అందరు కస్టమర్లు ఈ యాప్‌ను తప్పకుండా వినియోగిస్తారు. అందుకే దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఈ యాప్‌కు మరిన్ని భద్రత ఫీచర్లను జోడించింది. ఇకపై కేవలం బ్యాంక్ ఖాతాకు లింకైన ఫోన్ నంబర్‌తోనే యోనో యాప్‌లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సదరు ఫోన్ నంబర్ తప్పనిసరి. వేరే, నెంబర్ ద్వారా లాగిన్‌కు ప్రయత్నిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఎస్బీఐ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. ‘యోనో యాప్‌తో సురక్షితంగా బ్యాంకింగ్ సదుపాయాలు వినియోగించుకోండి. యోనో యాప్ భద్రతా ప్రమాణాలను మరింత పెంచామని’ తెలిపింది.
కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు బ్యాంకులు సైతం తమ పనివేళలు తగ్గించాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ నిర్వహించారు. సైబర్ కేటుగాళ్లు సులభంగా కస్టమర్ల పేరు, పాస్వర్డ్ వంటివి తెలుసుకొని వారి అకౌంట్లలోని డబ్బులు కాజేస్తున్నారు. దీంతో ఖాతాదారులకు తెలియకుండానే అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అవుతుందని అనేక మంది కస్టమర్ల నుంచి ఎబ్బీఐకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.
ఇదే విషయంపై 2020 జూన్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య కాలంలో ఎఫ్ఐఎస్ రెండు వేల మంది ఖాతాదారులపై సర్వే చేసింది. సర్వేలో పాల్గొనేవారిలో 34% మంది గతేడాది కాలంగా ఆర్థిక మోసాలకు గురయ్యామని చెప్పారు. అందులో 25– 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతలో 41% మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకున్నామని తెలిపారు. కాగా, 2020 డిసెంబర్ చివరి నాటికి దాదాపు 32 మిలియన్ల మంది ఎస్బీఐ యోనో యాప్ వినియోగదారులు ఉన్నారు. దీంతో యోనో యాప్ ద్వారా ఖాతారులకు అదనపు భద్రతను ఎస్బీఐ అందిస్తోంది.