రాజన్న రాజ్యం కోసం అన్న వస్తున్నడంటూ ఏపీలో వైసీపీ అధికారంలోకి తేవడానికి షర్మిల ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. వైసీపీ రెండేండ్లయినా గడవకముందే షర్మిల సొంత కుంపటి పెట్టుకుంది. అది కూడా ఆంధ్రాలో కాదు తెలంగాణాలో. కానీ మొదటి నుంచి ఆంధ్ర ముద్రపడిన షర్మిల తెలంగాణాలో ఎలా ముందుకెళ్తుందో అర్థం కావడం లేదు. వైఎస్సార్ టీపీ పేరుతో ఓ కొత్త పార్టీని స్థాపించారు. కానీ అనుకున్నంతా స్థాయిలో మాత్రం ఫలితం రావడం లేదు. తాను తెలంగాణ కోడలినేని చెబుతున్నా ఆమె పార్టీ వైపు తెలంగాణాలోని ముఖ్య నాయకులెవ్వరు తొంగి చూడడం లేదు. అయితే ఆమెకు మద్దతుగా షర్మిల తల్లి విజయమ్మ రంగంలోకి దిగినట్టు సమాచారం. సెప్టెంబర్ 2న వైఎస్ వర్థంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై జగన్ ఇంత వరకు స్పందించలేదు. తెలంగాణ సెంటి మెంట్ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఆమె పాచికలు పారడం లేదు. నిరుద్యోగుల కోసం ఎన్ని దీక్షలు చేసినా స్పందన కరువైంది.
అందుకనే షర్మిల పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేందుకే విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం అనే రాగం అందుకుందని విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఈ సమ్మేళనం కుటుంబ పరమైనది అనుకుంటే జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ లీడర్లు కూడా అటువైపు తొంగి చూడలేదు. ఈ సమావేశం రాజకీయ పరమైనది కాదు. ఎందుకంటే ఈ సమావేశానికి హాజరైన షర్మిల రాజశేఖర్రెడ్డి గురించి తప్పా ఎక్కడ రాజకీయాలు గురించి మాట్లాడలేదు. ఈ సమావేశం షర్మిల పార్టీకి మద్దతు పెరగడానికి వ్యూహాత్మకంగానే ఏర్పాటు చేశారా..? ఇంకా ఏదైనా మతలబు ఉందా అనే విషయం స్పష్టత రావడం లేదు. ఇతర పార్టీల నుంచి ఏ నాయకుడు హాజరు కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎవరు రాలేదు. ఈ సమావేశానికి వెళ్లకూడదని రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వినికిడి. అయితే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాత్రం హజరయ్యారు. రేవంత్ తమ నాయకులు వెళ్లొద్దనడానికి ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ వాడేనని, తమ పార్టీ ఆస్తి అని చెప్పడానికే వెళ్లొద్దని గుసగుసలు. కేవలం వైఎస్ పేరుతో బరిలోకి దిగుతున్న షర్మిల, విజయమ్మలు ఏ మేరకు విజయం సాధిస్తారో..