ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. విండోస్ 7 నుంచి విండోస్ 10 వరకు వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్‌లతోపాటు విండోస్ 2008 ఆపైన వచ్చిన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారు కొత్త మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు చెందిన వర్డ్, ఎక్సెల్ ఫైల్స్ రూపంలో కొత్త మాల్‌వేర్ అటాక్ అవుతుందని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే ఆ మాల్‌వేర్‌కు CVE-2021-40444 అని పేరు పెట్టారు. ఈ మాల్‌వేర్ ఉన్న ఆఫీస్ ఫైల్స్‌ను ఓపెన్ చేయగానే విండోస్ పీసీలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ దానంతట అదే ఓపెన్ అవుతుంది. తరువాత పీసీలో మాల్‌వేర్ డౌన్ లోడ్ అవుతుంది. అనంతరం అది పీసీ మొత్తానికి ఇన్‌ఫెక్ట్ అవుతుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సరిగ్గా పనిచేయదు.
అయితే యూజర్లు ఈ మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్ ను ఓపెన్ చేయకూడదని, విండోస్ అప్‌డేట్స్ ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించింది. త్వరలోనే దీనికి ఫిక్స్ ను డెవలప్ చేసి ప్యాచ్ రూపంలో అందిస్తామని తెలిపింది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.