వారం వ్యవధిలో మరో తుఫాన్ భారత దేశ తీరాన్ని తాకనుంది. గత నాలుగు రోజులుగా పలు రాష్ట్రాలను గులాబ్ తుఫాన్ కలవరపెట్టింది. ఏపీ,ఓడిషా, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురిశాయి. అయితే ప్రస్తుతం మరో తుఫాన్ పశ్చిమ కోస్తా రాష్ట్రాలను భయపెడుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. దీనికి షాషీన్ గా ఖతార్ దేశం నామకరణం చేసింది. గులాబ్ ప్రభావంతో గుజరాత్, అరేబియా ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఈ తుఫాన్ పుట్టుకొచ్చింది. ప్రస్తుత తుఫాన్ కారణంగా గుజరాత్ లో వానలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే గులాబ్ ప్రభావంతో గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అరేబియా సముద్రంలో 2021లో తౌక్టే తుఫాన్ ఏర్పడింది. దీని తర్వాత ఏర్పడిన తుఫాన్ షషీన్. ప్రస్తుతం పాకిస్తాన్ వైపు కదులుతుండటంతో గుజరాత్ మినహా మరే ఇతర భారత రాష్ట్రాలకు తుఫాన్ ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.