సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు మరో లేఖ రాశారు. గొట్టిపాటి రవికుమార్,డోలా శ్రీ బాల వీరంజనేయస్వామి,ఏలూరి సాంబశివరావు లేఖ రాసిన ఎమ్మెల్యేలలో ఉన్నారు. తమ జిల్లాకు మీ రాక, మా ప్రజలకు అందరికీ సంతోషం కన్నా, ఎక్కువ విచారాన్ని మిగిల్చింది.. ప్రకాశం జిల్లా ప్రగతి, సమస్యలపై మీరు ఏ మాత్రం శ్రద్ద వహించడం లేదని రుజువయ్యిందని లేఖలో పేర్కొన్నారు.
మేము ముందు మీకు రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారు, మా ఆవేదనని అర్ధం చేసుకోలేదు… ప్రజా సంక్షేమం, సమస్యలు, జిల్లాలో తీవ్ర సంక్షోభాన్ని చూడలేదని తెలిపారు. మేము లేవనెత్తిన సమస్యల్లో ఏ ఒక్కదానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదు, సమాధానం చెప్పలేదని.. కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిచ్చారన్నారు. అందుకే మా ఆవేదనను మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని.. మీ అడుగు పడిన ప్రకాశం నేల అడుగుతుంది! – ఎవరి ప్రయోజనాల కోసం మా “వెలుగొండ”కి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గెజిట్ లో వెలిగొండ ను అనుమతి పొందిన ప్రాజెక్ట్ గా చేయడం కోసం కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదని..!? మీ మాట విన్న ఒంగోలు గడ్డ ప్రశ్నిస్తుంది! ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం, యూనివర్సిటీ నిర్మాణం ఎప్పుడని..!? అని ప్రశ్నించారు. రాళ్లపాడు ప్రాజెక్ట్ను ఆధునీకరించి ఆయకట్టు పెంచేలా చర్యలు, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే మోటర్లకు మీటర్లను మా రాష్టంలో ఏర్పాటు చేయమని కేంద్రానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశం రైతులకు, ప్రజలకు అండగా నిలవాలని కోరారు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు.