అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొందరు మంచికంటే చెడుకే ఎక్కువగా వాడుతున్నారు. సెక్యురిటీ విభాగాలు ఎంత అప్రమత్తత చేసినా ఇంకా బ్యాంకుల పేర్లతో మోసపోయే వారు లేకపోలేదు. అయితే వీరిలో అక్షరం ముక్కరానివారికంటే జాబ్ చేసేవాళ్లే ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో బలవతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనను చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. కొత్తగా క్రెడిట్ కార్డును పొందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దాన్ని యాక్టివేట్ చేసుకునే క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి క్షణాల్లో వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. సిద్దిపేట్ లో చోటుచేసుకున్న ఈ సైబర్ మోసం పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట్ జిల్లా సిద్దిపేట్ మండలం రంగదాంపల్లిలో చోటుచేసుకున్న సైబర్ నేరంపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్ కుమార్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట్ అర్బన్ మండలం రంగదాంపల్లి గ్రామానికి చెందిన నిమ్మ కార్తీక్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ టెక్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కరోనా నేపథ్యంలో అతను ఇంటి నుంచే పనిచేస్తున్నాడు.
కార్తిక్ రెడ్డి ఇటీవలే ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు . కార్డును యాక్టివేట్ చేసుకునే క్రమంలో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మధ్యలోనే అది డిస్ కనెక్ట్ అయిపోయింది. ఎలా పసిగట్టారో ఏమోగానీ, మరు నిమిషమే సైబర్ నేరగాళ్లు కార్తీక్ కు ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ కోసం ఓ లింకు పంపుతామని, దాన్ని ఓపెన్ చేసి డీటెయిల్స్ నింపాలని చెప్పుకొచ్చారు.
ఫోన్ చేసింది బ్యాంకువాళ్లేమోననుకొని కార్తీక్ సదరు లింకును ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు వివరాలను అప్ లోడ్ చేశాడు. అంతే, చూస్తుండగానే అతని కార్డులో ఉన్న 49,995 రూపాయలు మాయమైపోయాయి. అతని మొబైల్ నంబర్ కు ‘మీ క్రెడిట్ కార్డు నుంచి రూ.49,995 డెబిట్ అయ్యాయి’అని మెసేజ్ వచ్చింది. అంతే కార్తీక్ ఫీజులు ఎగిరిపోయాయ్.. బిత్తరపోయిన బాధితుడు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరాతీశాడు..
ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సైబర్ నేరం కింద కేసు నమోదైంది. సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆన్ లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల వ్యవహారంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఎవరికి ఓటీపీ కానీ లింక్ లో ఎలాంటి డీటెల్స్ ఇవ్వాల్సివచ్చినా తొందరపడి చేయొద్దని పోలీసులు తెలిపారు.