అధిక బరువును తగ్గించుకోవడం కోసం అనేక మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం, హెర్బల్, విటమిన్ సప్లిమెంట్లు వాడడం.. వంటి అనేక పనులు చేస్తుంటారు. అయితే అధిక బరువు తగ్గేందుకు అవి అవసరమే అయినా.. కింద తెలిపిన ఓ సులభమైన చిట్కా పాటిస్తే కేవలం 12 వారాల్లోనే 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. మరి ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అధిక బరువు తగ్గాలనుకునే వారు నిత్యం 3 పూటలా భోజనానికి ముందు కనీసం 2 గ్లాసుల నీటిని తాగాలి. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సాక్షాత్తూ కొందరు సైంటిస్టులే ఈ విషయంపై పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. బ్లాక్ బర్గ్‌లోని వర్జీనియా టెక్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సెన్సెస్ హ్యుమన్ న్యూట్రిషన్, ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజ్ విభాగానికి చెందిన పరిశోధకులు ఇటీవలే 48 మంది వ్యక్తులపై ప్రయోగాలు చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు.
ఒక గ్రూప్‌కు చెందిన వారిని నిత్యం భోజనానికి ముందు 2 గ్లాసుల నీటిని తాగమని చెప్పారు. రెండో గ్రూప్‌కు చెందిన వారు నీటిని తాగలేదు. ఇలా 12 వారాల పాటు ప్రయోగం చేశారు. చివరకు వెల్లడైందేమిటంటే.. భోజనానికి ముందు 2 గ్లాసుల నీరు తాగిన వారు 2 కిలోల వరకు బరువు తగ్గగా, నీరు తాగని వారు బరువు తగ్గలేదు. దీంతో సైంటిస్టులు నిర్దారించింది ఏమిటంటే.. అధిక బరువు తగ్గాలని అనుకునే వారు నిత్యం 3 పూటలా భోజానికి ముందు 2 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు..!