ఢిల్లీని వాయు కాలుష్యం భయపెడుతోంది. వరసగా ఐదు రోజులుగా రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది. ప్రతీ ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో వాయు నాణ్యత గణనీయంగా పడిపోతోంది. పంటల కాలం ముగియడంతో హర్యానా, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో పంటలను దహనం చేయడంతో ఢిల్లీ లో వాయు నాణ్యత పడిపోతుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ ఏజెన్సీ( SAFAR) ప్రకారం, ఆదివారం కూడా ఢిల్లీలో కాలుష్యం పెరిగినట్లు వెల్లడించింది. ఢిల్లీకి వాయువ్య ప్రాంతంలో శనివారం రోజు 1734 వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయ గడ్డి మొదలగు వ్యర్థాలను కాల్చడంతో మంటలు సంబవించాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క డేటా ప్రకారం రాజధానిలో 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 289 నమోదైంది. ఇది శనివారం 268గా ఉంది. ప్రస్తుతం వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశగా గాలి దిశలో మార్పు కారణంగా రానున్న రెండు రోజుల్లో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడే అవకాశం ఉందని SAFAR పేర్కొంది. సహజంగా వాయు నాణ్యత సూచి (AQI) 0-50గా ఉంటే మంచిదిగా, 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమైనదిగా, 101-200 గా ఉంటే మోడరేట్ గా, 201-300 ఉంటే పూర్ ఎయిర్ క్వాలిటీగా, 301- 400 గా ఉంటే వెరీ పూర్ గా, 401-500 గా ఉంటే సివియర్ ఎయిర్ క్వాలిటీగా పరిగణించబడుతుంది.