హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిఆర్ఎస్ నాయకుల గ్రామాలలో ఈటెల రాజేందర్ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా అందులో తొమ్మిది రౌండ్ల లోనూ ఈటెల మెజారిటీ కనబరిచారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈటెల 5 వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఇక హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో కూడా ఈటల రాజేంద్ర హవా కనిపించింది.
అంతేకాకుండా టీఆర్ఎస్ సీనియర్ నేత లక్ష్మీకాంతరావు స్వగ్రామం సింగపూర్ లో కూడా బిజెపి లీడ్ లోకి వచ్చింది. అదేవిధంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు దత్తత గ్రామం మామిడిపల్లి లోనూ బిజెపి లీడ్ కనిపించింది. హరీష్ రావు హుజురాబాద్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హుజరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను తానే తీసుకొని కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ హరీశ్ రావు ప్రచారం చేశారు. కానీ ఆయన దత్తత గ్రామంలోనే టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అదేవిధంగా దళిత బంధు పథకం ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనూ కమలం హవా కనిపించింది.