తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరంలో ఉన్న వాయుగుండం.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పుదుచ్చేరి, చెన్నై మధ్యలో వాయుగుండం తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. రాగల 6 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ వాయుగుండం నుంచి ఉపరితల ద్రోణి.. కోస్తా ఆంధ్రా తీరం మీదుగా ఇంటీరియర్ ఒడిశా వరకు.. సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం.. రాష్ట్రానికి దూరంగా వెళ్లిపోవడంతో.. తూర్పు దిశగా తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.