ఈ మధ్య కాలంలో దొంగలు మరీ తెలివిమీరుతున్నారు..మొన్నటికిమొన్న కేవలం దొంగతనం చేయడానికి కిటికీలో పట్టాలని ఒక దొంగ ఏకంగా 5 కేజీల బరువతగ్గాడు. ఇప్పుడు.. జొవాద్ తుఫాన్ భయంతో వ్యాపారాలకు సెలవు పెట్టి అందరూ ఇళ్లకే పరిమితమైతే… ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్స్ లో, జ్యూయలరీ షాప్స్ లో తమ చేతివాటం చూపించారు.. ఇది జరిగింది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..
జొవాద్ తుఫాన్ రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీసులు ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తుఫాన్ కు బయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు తమ వ్యాపారాలు బంద్ చేసి ఇంటిదగ్గరే ఉన్నారు. దీంతో ఇదే అదనుగా చూసుకొని దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్సో లోనూ, జ్యూయలరీ షాపుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ.. వారి కష్టాన్ని దోచుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న పది షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. ఇక సముద్ర తీర ప్రాంత మండలాల్లో తుఫాన్ సహాయ చర్యల్లో పోలీసులు ఉండడంతో.. గస్తీ తక్కువగా ఉంటుందని ముందే గ్రహించిన దుండగులు.. శుక్రవారం అర్ధరాత్రి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.. షాపులకున్న షర్టర్లు ఎత్తి పది షాపుల్లో చోరీలకు పాల్పడడమే కాక, సీసీ కెమెరాలు ఉండడం చూసి ఎటువంటి ఆధారాలు లేకుండా.. సీసీ ఫుటేజ్ లను తమతో పాటు తీసుకువెళ్లారట.ఇక ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు.. తమ షాపుల్లో చోరీలు జరిగాయని గుర్తించి లబోదిబోమంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారురు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మందస మండలం హరిపురం గ్రామంలో కూడా మరో చోరీ జరిగింది. రాఘవ జ్యూయలరీ షాపులో చోరీకి పాల్పడి.. సుమారు రెండు లక్షల విలువ చేసే వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇలా ప్రజల కష్టాన్ని దొంగలు దోచుకుంటున్నారు. తుఫాను భయంతో షాపులు మూసేసి వ్యాపారులు ఇళ్లకు వెళ్తే.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిసి మిగిలిన వ్యాపారస్తులు భయపడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా ఫలితం లేకుండా పోవటంతో దొంగలను పట్టుకోవటం కాస్త కష్టమనే చెప్పాలి.
– Triveni Buskarowthu