కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప మరోసారి వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన దాడులకు దేశంలోని అందరూ సైనికులను అభినందిస్తుంటే.. మరోవైపు యడ్డీ మాత్రం ఈ విషయానికి రాజకీయ రంగు పులిమారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంటే.. మరోవైపు ఇలా యడ్యూరప్ప వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పలువురు విమర్శిస్తున్నారు.
కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప నిన్న సాయంత్రం చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల వల్ల దేశంలో మళ్లీ మోడీ ప్రధాని అవుతారని యడ్డీ అన్నారు. ఇదే అంశం రానున్న ఎన్నికల్లో మోడీ ప్రభంజనం సృష్టించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 28 స్థానాలకు గాను 22 స్థానాలు గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు.
దేశంలో పరిస్థితి రోజు రోజుకీ బీజేపీకి అనుకూలంగా మారుతుందని యడ్యూరప్ప అన్నారు. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన దాడి వల్ల దేశంలో మళ్లీ మోడీ గాలి వీస్తుందని అన్నారు. దీని ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనిపిస్తుందని యడ్యూరప్ప పేర్కొన్నారు. కాగా యడ్యూరప్ప వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్లోనే కలకలం సృష్టిస్తున్నాయి. సున్నితమైన అంశంపై ఇలా యడ్డీ వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.