కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో రైతు సంఘాల నేతలు బుధవారం మరోసారి చర్చలు జరపనున్నాయి. ఇప్పటికీ చాలా డిమాండ్లు నెరవేరాయని, కొన్ని విషయాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం బుధవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సానకూలమైన ప్రతిస్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక సమాధానం వచ్చింది. దీనిపై మంగళవారం ఢిల్లీలోని సింఘు బార్డర్‌లో సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో 32 రైతు సంఘాల నేతలు సమావేశమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకమైన సమాధానం వచ్చింది. ఈ విషయమై రైతు సంఘాల నేతలు నిర్దిష్టంగా చర్చించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించి కొన్ని విషయాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నదని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొన్నది. ఆందోళనల విరమణపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.