ప్రపంచంలో ఓమిక్రాన్ విస్తరించడం ఇప్పుడు అందరిని కలవరపెడుతోంది. దీంతో దేశంలో బూస్టర్ డోసు ఇవ్వడంపై చర్చకు తెరలేసింది. చాలా రాష్ట్రాల నుంచి కేంద్రానికి బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ముందుగా వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోసులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరతున్నాయి. తాజాగా ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం బూస్టర్ డోసుపై వివరాలను పార్లమెంటరీ ప్యానెల్ కు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అవసరమైతే బూస్టర్ డోసుల తీసుకోవచ్చని… అయితే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తే ఓమిక్రాన్ వేరియంట్ ను సమర్థవంతంగా ఎదురుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పటివరకు 57 దేశాలకు విస్తరించగా.. ఈ రకం కేసులు 2,300పైగా నమోదయ్యాయి.