జిన్నా టవర్ పేరు మార్చాలి.. లేకపోతే కూలుస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హెచ్చరించారు. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సందర్భంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని.. గుంటూరు జిల్లాలో జిన్నా టవర్ పేరు మార్చడంపై ఏపీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు.
దేశ విభజనకు కారణం జిన్నానేనని.. పాకిస్తాన్‌లో భారత్‌పై విషబీజాలు నాటుకునేలా వ్యవహరించిన వ్యక్తి జిన్నా అని నిప్పులు చెరిగారు. జిన్నా కారణంగా దేశ విభజన సమయంలో ఊచకోత జరిగిందని.. పాకిస్తాన్‌ను శతృ దేశంగా భావిస్తున్నామని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. ఇప్పటికీ జిన్నా పేరును గుంటూరు సెంటర్‌లో కొనసాగించడం సబబు కాదని… అబ్దుల్ కలాం పేరైనా.. లేదా గుంటూరు జిల్లా ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే తరహలో మరెక్కడైనా పేర్లు ఉంటే వాటినీ మార్చాలని అధికార వైసీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ విషయంలో ఇక బీజేపీ పార్టీ అస్సలు తగ్గదని పేర్కొన్నారు.