జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ లేఖ రాసారు. జిల్లేడుబండ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం మండలాల్లో తాగు, సాగునీటికి గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత కరవు పీడిత ప్రాంతాల్లో ఒకటి. తాగు, సాగునీటి అవసరాలు తీరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ సేకరణ సమస్య కారణంగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. జిల్లేడుబండ రిజర్వాయర్ ఏర్పాటుతో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరుతాయి. మూడు మండలాల్లోని 23 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. జిల్లేడుబండ రిజర్వాయర్ ధర్మవరం నియోజకవర్గానికి చిరకాల స్వప్నం. పెండింగ్ లో ఉన్న మొదటి దశ భూ సేకరణ కోసం 93.59 కోట్లు విడుదల చెయ్యండి. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుంది అని లేఖలో పేర్కొన్నారు.