దేశం ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో బాధపడుతోంది. వేగంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే… మరో పాత సమస్య కొత్తగా బయటపడింది. అత్యంత తీవ్రమైన ‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్’( కేఎఫ్డీ) అనే వ్యాధి బయటపడింది. దీనిని మంకీ ఫివర్ గా కూడా పిలుస్తారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా తీర్థ హళ్లీ, కుడిగే గ్రామంలో ఈవ్యాధి బయటపడింది. తాజాగా 57 ఏళ్ల వయసు మహిళకు వ్యాధి సోకింది. బాధితురాలు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా.. కేఎఫ్ డీ ఉన్నట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
2019 తర్వాత ఇప్పుడే మొదటిసారిగా కొత్త కేసు బయటపడింది. డిసెంబర్ 2019లో కర్ణాటకలోని సాగర్ తాలూకాలోని అరలగోడు ప్రభావితమైంది. ఆసమయంలో ఈ వ్యాధి కారణంగా 22 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా ఇప్పటి వరకు కేఎఫ్ డీ బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండేళ్ల కాలంగా అక్కడ ఈ వ్యాధి రాలేదు. తాజాగా మహిళకు వ్యాధి సోకింది. ఇది వ్యాధి బారిన పడిన కోతుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా కర్ణాటక అటవీ ప్రాంతంలో ఈ వ్యాధి మొదటి సారిగా బయటపడింది.