మీకు ఏదైనా లాటరీ తగిలితే ఏం చేస్తారు.. ఆహా.. నేనేదో నక్క తోక తొక్కి వచ్చినట్టున్నాను అని ఎగిరి గంతేస్తారు కదా. కానీ.. ఈయన చూడండి.. కోట్ల విలువైన ఫ్లాట్ లాటరీలో తగిలితే వాస్తు బాగోలేదని వదిలేసుకున్నాడు.. సత్తెకాలపు మనిషిలా ఉన్నాడే..
మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు.. ఇలాంటి వాటిని నమ్మేవాళ్లు ఎక్కువగానే ఉన్నారు ఈ జనరేషన్‌లో. మనం సాంకేతిక యుగంలో దూసుకుపోతున్నా సరే.. వాటిని బలంగా నమ్మే వ్యక్తులు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ వ్యక్తి ఏం చేశాడంటే.. వాస్తు సరిగా లేదని 6 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్‌నే వదులుకున్నాడు.
ఈ ఘటన ముంబైలో చోటు చేసుకున్నది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ శాఖకు శివసేన తరుపున చీఫ్‌గా పనిచేసే వినోద్ షిర్కేకు గత సంవత్సరం డిసెంబర్‌లో లాటరీలో రెండు ఫ్లాట్స్ వచ్చాయట. 4.99 కోట్లు, 5.80 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను ఆయన ఆ లాటరీలో గెలుచుకున్నాడు.
అంత ఖరీదైన ఫ్లాట్లు లాటరీలో తగిలితే ఎవరైనా ఊరుకుంటారా? ఎగిరి గంతేయరు. వినోద్ మాత్రం ఆ ఫ్లాట్లలో 5.80 కోట్ల విలువైన ఫ్లాట్‌కు వాస్తు సరిగ్గా లేదని వదిలేసుకున్నాడట. తనకు ఆ ఫ్లాట్ వద్దని చెప్పాడట. వాస్తు ప్రకారం మార్పులు చేసుకునే వెసులుబాటు ఉన్నా కూడా అలా ఆ ఫ్లాట్‌కు చేసేవాడినని.. కానీ.. ఆ ఖరీదైన ఫ్లాట్‌లో మార్పులు చేసే అవకాశం కూడా లేదని.. అందుకే ఆ ఫ్లాట్‌ను వదులుకోవాల్సి వచ్చిందని వినోద్ షిర్కే మీడియాకు తెలిపాడు.