వంట నూనెల సరఫరా దేశంలో భారీగా పడిపోయింది. ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా వంట నూనెల దిగుమతులు పడిపోయాయంటున్నాయి వంట నూనెల కంపెనీలు. సుమారు 80 శాతం మేర సన్ ఫ్లవర్ క్రూడాయిలును ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటున్న ఇండియా… యుద్దం కారణంగా షిప్‌మెంట్‌లు లేకపోవడంతో పడిపోయాయి దిగుమతులు. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా 307684 టన్నులుంటే.. ఫిబ్రవరిలో 140000 టన్నులకు దిగుమతులు పడిపోయాయంటోన్నాయి మార్కెట్ వర్గాలు.
మార్చి నెలలో 140000 టన్నుల కంటే తక్కువగానే దిగుమతులయ్యే అవకాశం ఉంది. సన్‌ఫ్లవర్ దిగుమతులు నిలిచిపోవడంతో పామాయిల్ నూనెలకు డిమాండ్ పెరిగింది. మరింత పామాయిల్ కోసం ఇండోనేషియా, మలేసియా దేశాల నుంచి దిగుమతికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరితో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో 22 శాతం మేర పడిపోయాయి వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు. పరిస్థితి ఇలాగే ఉంటే వంట నూనెల సరఫరా మరింత కష్టమవుతుందంటున్నారు వ్యాపారస్తులు. పది రోజుల క్రితంతో పోలిస్తే సరాసరి రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగాయి అన్ని రకాల వంట నూనెల ధరలు.
దక్షిణాది, ఒడిస్సా రాష్ట్రాల్లోనే దిగుమతుల్లో 70 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఉంది. లీటర్ పామాయిల్ ధర యుద్దం ప్రారంభానికి ముందు రూ. 125 ప్రస్తుతం రూ. 163 గా నమోదు అయింది. అలాగే.. లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర యుద్దం ప్రారంభానికి ముందు రూ. 135 ప్రస్తుతం రూ. 170కు చేరగా… లీటర్ పల్లీ నూనె ధర యుద్దం ప్రారంభానికి ముందు రూ. 148 ప్రస్తుతం రూ. 175 కు చేరుకుంది. ఇక లీటర్ రైస్ బ్రాన్ ఆయిల్ ధర యుద్దం ప్రారంభానికి ముందు రూ. 126 ప్రస్తుతం రూ. 150 కు చేరుకుంది.