జగన్ పార్టీ పెట్టక ముందు నుంచి కొంత మంది లీడర్లు ఆయనతో ఉన్నారు. అదేవిధంగా మహిళా నేతలూ ఉన్నారు. వారిలో సుచరిత ఒకరు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగిన లీడర్ ఆమె. తనకు అనూహ్య రీతిలో హోం శాఖను ఇవ్వడాన్ని ఇప్పటికీ ఆమె గొప్ప విషయంగానే భావిస్తారు. అదే స్థాయిలో అభివర్ణిస్తారు. కొన్ని విభేదాల కారణంగా మౌనంగా ఉండిపోయిన సుచరిత ఎపిసోడ్ ను మీడియా కూడా టీఆర్పీకు అనుగుణంగా వాడే ప్రయత్నం చేసింది.
అయితే అధిష్టానంకు, తనకూ మధ్య ఎటువంటి అడ్డుగోడలూ లేవని ఆమె తేల్చి చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. దీంతో అసంతృప్తత అన్నది సర్దుమణిగింది. ఇకపై పార్టీ కోసం ఆఖరి శ్వాస వరకూ పనిచేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకున్నా ఓ వైసీపీ కార్యకర్తగానే తప్పుకుంటానని చెప్పి వివాదానికో ఫుల్ స్టాప్ పెట్టారామె.
3 రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ నిన్నటి వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ విధంగా ఆంధ్రావనిలో నెలకొన్న నాటకీయ పరిణామాలు అన్నీ ఒక్కసారిగా ముగిసి, కాస్త రిలీఫ్ దొరికింది మీడియాకు. అవును! మీడియాకే రిలీఫ్..పొలిటీషియన్లకు కాదులేండి. ఎందుకంటే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎపిసోడ్ ను వైసీపీ కన్నా ఎక్కువగా సీరియస్ గా తీసుకుని ఆగమాగం చేసింది మీడియానే ! ప్రింట్ కన్నా ఎలక్ట్రానిక్ మీడియా హంగామాలు ఎక్కువ ఉన్న కాలంలో ఉన్నాం కదా ! కనుక ఆమె ఇష్యూని హైలెట్ చేసేందుకు కొంత తాపత్రయం మరికాస్త అతి కలిసి నిమిషనిమిషానికి ఏదో ఒకటి చెప్పాలి అన్న ఆత్రం కనిపించింది. ఆ విషయంలో మాత్రం కొన్ని ఛానెళ్లు ఆమె సీఎం ఆఫీసుకు బయలు దేరిన దగ్గర నుంచి మళ్లీ ఆమె మీడియాతో మాట్లాడే వరకూ చాలా ఆసక్తికి ప్రాధాన్యం ఇచ్చాయి.
ఇక ఆమె చెప్పిన మాటల ప్రకారం చూస్తే..అందరిలానే తానూ అని ఓ అంగీకారం అయితే తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో తానో సభ్యురాలిని అని చెప్పారు. అంతేకాదు తనను పదవి నుంచి తప్పించారన్న బాధ ఉన్నా కొన్ని అనారోగ్య కారణాల రీత్యా రాలేకపోయానని కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగిసిందని భావించాలి. అయితే ఈ విషయమై కొంత కాలంగా నడిచిన చర్చలో అనేక ఊహాగానాలు వచ్చాయి. అవన్నీ తాను విన్నాను అని, విని నవ్వుకున్నానని కూడా తేల్చేశారు.
వాస్తవానికి మోపిదేవి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా ముందు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే మా అమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని సుచరిత కుమార్తె మీడియా ఎదుట చెప్పారు. వీటిపై కూడా ఆమె చెప్పిన క్లారిఫికేషన్ కాస్త విమర్శలకు తావిచ్చినా ప్రస్తుతానికి వివాదం అయితే సర్దుమణిగింది. ఇక కొత్త మంత్రులు తమ తమ పనుల్లో నిమగ్నం అయి
పాలనను గాడిలో పెట్టడమే మిగిలి ఉంది.