నిన్నటి ఒంగోలు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి తనను వ్యతిరేకిస్తున్న మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. పదే పదే ఈనాడు పత్రిక లో ప్రచురితం అయిన మొదటి పేజీ కథనాల శీర్షికలు చదివి వినిపించి తన అసహనం స్థాయిని మరో సారి పెంచారు.ఆ విధంగా ఆయన ప్రత్యర్థుల బలం పెంచారేమో ! అని అనుమానం వస్తున్నది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే విధంగా చేశారా? లేదు కదా! కానీ అధికార సమావేశాల్లో ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రత్యర్థి మాధ్యమాలను ప్రస్తావిస్తూ మాట్లాడితే అవి దేశం యావత్తూ చూస్తే ఆయనలో అభద్రతకు అవే నిదర్శనం అయ్యే ప్రమాదం ఉంది. నో డౌట్ ..కొన్ని పథకాలు మంచివి.. కొన్ని అమితంగా ప్రజలకు చేరువ అయ్యేవి కావు కూడా ! కొన్నింటి ఫలితంగా ఆయన చెప్పిన విధంగా బడుగులకు మేలు జరుగుతోంది. ఆ శాతం ఎంతన్నది ఇప్పటికిప్పుడు తేల్చలేం. కానీ ఇవాళ జగన్ నమ్ముకున్న సంక్షేమ సూత్రాలన్నీ రాజ్యాంగ నియమాలకు లోబడే ఉన్నాయని పలుమార్లు ఆయనకు మద్దతుగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆ విధంగా ఆయన మాట్లాడినా సరిపోయేది.
నిన్నమొన్నటి వేళ పథకాలన్నవి ఏ విధంగా ప్రయోజనకారి అవుతున్నాయో ఏ విధంగా జీవన ప్రమాణ రీతులను పెంచుతున్నాయో రెవెన్యూ మంత్రి ఉదాహరణలతో సహా వివరించారు. అలానే ముఖ్యమంత్రి కూడా ఈ సీనియర్ లీడర్ ను ఫాలో అయితే సరిపోయేది. ఆయన మీడియాను ఏమీ అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే వార్తలు కథనాలు వివరణలు విశ్లేషణలు ఇలా వేటినీ ఇవాళ నిలువరించే శక్తి ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే ఒక మాధ్యమంలో వార్త రానంత మాత్రాన ప్రభుత్వాల తప్పిదాలు కానీ లేదా ప్రభుత్వాలు ప్రజలకు చేసే మేలు కానీ వెలుగులోకి రాకుండా ఉండవు. సోషల్ మీడియా అన్నది ప్రింట్ మీడియా కన్నా ఎక్కువ ప్రభావితం చేస్తోంది ఇవాళ. కనుక ఈనాడు రాసినంత మాత్రాన ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోదు. ఈనాడు రాయనంత మాత్రాన సంక్షోభ నివారణకు ఏపీ సర్కారో లేదా కేంద్రమో తీసుకునే నిర్ణయాలు తీసుకోకుండా చూస్తూ ఉండిపోవు. ఆవిధంగా మన ప్రభుత్వ పెద్దలు ప్రేక్షక పాత్రకే పరిమితం అయిపోరు కూడా ! కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈనాడునో లేదా మిగతా మీడియాలనో ఉద్దేశించి జగన్ మాట్లాడితే ఓ విధంగా అది ఆయన చేస్తున్న తప్పే అవుతుంది తప్ప ! ఆయన చెప్పాలనుకుంటున్న మాటలకు విలువ అన్నది అంత వేగంగా దక్కదు.