మనం ఎలా పెరిగామో అలానే జీవితాంతం ఉండాలని ఎవరూ అనుకోరు. పేదరికంలో పుట్టినా.. కోట్లకు పడగెత్తవచ్చు. రేకుల షెడ్డే ఇళ్లు.. ఎండొచ్చినా, వానొచ్చినా ఆ రేకుల షెడ్డులోకి రావాల్సిందే. అలాంటి స్థితిలో పెరిగిన ఓ అమ్మాయి.. వ్యాపారం చేయాలనుకుంది. అనుకోవడమేంటి చేసింది. 1000 రూపాయల పెట్టుబడితో మొదలేసిన తన వ్యాపారం నేడు కోట్ల టర్నోవర్ తో నడుస్తుంది. ఇలా జీరో నుంచి వచ్చిన వారి కథలు నేడు ఎంతో మంది యువతను మోటివేట్ చేస్తాయి. అందుకే మీకోసం ఈ స్టోరీ.. చూసేయండి..!
మధ్యతరగతి కుటుంబాల్లో అందంకోసం ఇంటి చిట్కాలనే పాటిస్తుంటారు. దాన్నే వ్యాపార సూత్రంగా చేసుకుంది కోల్‌కతాకి చెందిన ఆకాంక్షా మోదీ. రసాయనాలు ఉపయోగించి చేసే సౌందర్య సాధనాలతో దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తడం చూసిన ఆకాంక్షా..సహజసిద్ధ పదార్థాలతో ఫేస్‌మాస్క్, ఫేస్‌వాష్, టోనర్లు, సీరమ్స్, సన్‌స్క్రీన్, కేశతైలం- ఇలా 80 రకాల సౌందర్య ఉత్పత్తులు రూపొందిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సాగుతున్న ఆమె వ్యాపారం 40 దేశాలకు ఎగబాకింది.
ఈమె తండ్రి టీవీ డాక్యుమెంటరీల నిర్మాణంలో పనిచేస్తారు. తల్లి గృహిణి. కుటుంబం గడవటం కూడా కష్టంగా ఉండేది. ‘మేడమీద చిన్న రేకుల షెడ్డులో జీవనం. ఎండకాలం, వానాకాలం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు.. అయినా ఆనందంగానే గడిపేవాళ్లం’ అంటూ జ్ఞాపకాలను తన గతాన్ని నెమరేసుకుంది ఆకాంక్ష.
ఆకులూ పూలూ వేళ్లతో మేనత్త చేసే చర్మసౌందర్య సాధనాలు అద్భుతంగా పనిచేయడం చూసి పదేళ్లకే ప్రేరణ పొందింది ఆకాంక్ష. పెద్దయ్యాక అలాంటివి చేసి అమ్మాలనుకునేది. స్కూలు దశలోనే అధ్యయనం ప్రారంభించింది. అనేక సెమినార్లకు వెళ్లేది.. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో మధ్యాహ్నానికి కాలేజీ కాగానే సౌందర్యోత్పత్తుల సంస్థలో కొలువుకి వెళ్లేదట.. మూడున్నర వేలకు సేల్స్ ప్రమోటర్‌గా చేరింది.. ఏడాదికే మేనేజర్ని చేసి రూ.45 వేలు ఇచ్చారట.
అత్తకు వచ్చిన సమస్యతో మారిన జీవితం…
2004లో నగల వ్యాపారి కృనాల్ మోదీని పెళ్లాడింది. అత్తింటివారు ఉద్యోగం మానేసి భర్తకు సహకరించమన్నారు. కానీ అందులో తనకు ఆసక్తి అనిపించలేదు..మరో ఆరేళ్లు అలాగే కొనసాగింది. ఈలోపు అత్తగారికి చర్మ సమస్య వస్తే డాక్టరు వద్దకు తీసుకెళ్లింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. క్లినిక్‌లో ఒక మహిళ మొటిమలతో ఇబ్బంది పడుతున్నానని, ఎందర్ని సంప్రదించినా ఫలితం లేదని చెప్పింది.. తాను పాటిస్తున్న సహజ చిట్కాల్ని చెప్పింది ఆకాంక్ష.
రెండు వారాల తర్వాత ఆమె ఫోన్ చేసి మొటిమలు దాదాపుగా తగ్గిపోయాయని చెప్పింది. ఆమె మరికొందరికి చెప్పడంతో వాళ్లంతా ఆకాంక్షను సంప్రదించడం మొదలుపెట్టారట. ఆ ప్రేరణతో స్కిన్ గ్లో బ్లెండ్స్, యాంటీ ట్యాన్ బ్లెండ్.. లాంటివి తయారుచేసింది. వెయ్యి రూపాయల పెట్టుబడితో 2010లో ‘రూట్స్ అండ్ హెర్బ్స్’ పేరుతో ఇంట్లోనే తయారుచేసి అమ్మిందట.. అందరూ బాగున్నాయనడంతో ఒకసారి ప్రదర్శనలో పెట్టింది. ‘మూడున్నర వేలు అద్దె చెల్లిస్తే ఒక బల్ల కూడా పట్టన్నంత చిన్న స్టాల్ దొరికింది.
కానీ మూడు రోజులకే తొమ్మిది వేలు లాభమొచ్చింది. అలా మొదలై రెండు మూడేళ్లలోనే రూ.50 లక్షల విలువైన యంత్రాలతో పదివేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకునేంతగా సంస్థ విస్తరించింది. ఇప్పుడు తన టర్నోవర్ రూ. ఆరు కోట్లకు చేరింది.
మనకు ఎందులో నైపుణ్యం ఉందో, ఏ పని మనకు కష్టంగా అనిపించదో అదే దాన్ని వృత్తిగా మార్చుకుంటే.. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడొచ్చు కూడా.. నేడు ఎంతోమంది.. ఇష్టంలేని ఉద్యోగాలు చేస్తూ.. అవసరంలేని ప్రజర్ ను మోస్తున్నారు. నిజానికి ఆర్థిక పరిస్థితులే వారిని అటువైపు అడుగులు వేయించి ఉంటాయి. లైఫ్ లో ఏదీ చేయాలన్నా దానికి వయసును సాకుగా చూపించుకోకూడదు.
-Triveni Buskarowthu