82 అర్బన్ నియోజకవర్గాలు
6791 ఎకరాలు
ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం,
గుంటూరు, కడప, కర్నూలు,
సత్యసాయి, తిరుపతి జిల్లాలలో 864.29 ఎకరాల్లో
ఎల్ ఐజీ లే ఔట్ల కోసం స్థలం గుర్తింపు
పనులు కూడా ప్రారంభం అయ్యాయని అధికారుల వెల్లడి
రేపటి నుంచి ఇంటింటికీ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు యువ ముఖ్యమంత్రి జగన్. పథకాల అమలు, వాటి తీరు తెన్నులను తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరిగి సర్వే చేయనున్నారు. సర్వే ఆధారంగా మరికొన్ని పథకాలకు శ్రీకారం దిద్దనున్నారు. అదేవిధంగా ఇప్పటిదాకా కొద్దిపాటి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు అందుకున్న మధ్యతరగతి వర్గాలనూ ఆయన ఆదుకోనున్నారు.
అంతేకాదు పథకాల నిర్వహణలో అల్పాదాయ వర్గాలకే కాదు మధ్య తగరతి వర్గాలకూ కొంత ప్రాధాన్యం ఇచ్చినా వారిని కూడా సంతృప్తం చేసేందుకు మరో ప్రక్రియకు శ్రీకారం దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతిష్టాత్మక రీతిలో వాటిని అర్హులకు అందిస్తున్న వైఎస్సార్ సర్కారు కొత్తగా మరో ఆలోచన చేస్తోంది. ఓ వైపు టిడ్కో ఇళ్లను పూర్తిచేయిస్తూనే, మరోవైపు పేదలకు జగనన్న కాలనీల నిర్మాణాన్ని చేపడుతోంది.
వీటితో పాటు మధ్య తరగతి జీవులకు ఉపయుక్తం అయ్యే విధంగా, వారికి ఆసరా ఉండేందుకు, వారి సొంతింటి కలలను నెరవేర్చేందుకు ఎంఐజీ (మిడిల్ ఇన్కం గ్రూప్) లే ఔట్లు వేయడానికి ప్రభుత్వ తరఫున సన్నద్ధతను తెలిపింది. దీంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఓ ఎంఐజీ లే ఔట్ రానుంది. మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం మంచి నమూనాలతో లే ఔట్లు రానున్నాయి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా న్యాయ వివాదాలు లేకుండా కూడా చూడాలని ఆదేశించారు.
వాస్తవానికి ఎప్పటి నుంచో ఓ వాదన ఉంది. పథకాలన్నీ పేదలకేనా అన్న వాదన వినిపిస్తోంది. పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఓ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీ ఆచరణలోకి తేవాలన్న ఆలోచనతో ఉంది. గతం కన్నా భిన్నంగా ఇప్పుడు గ్రామాలలో కూడా సొంతింటి కల నెరవేరాలంటే అది ఆర్థికంగా ఇబ్బందే ! ఇదే సమయంలో ప్రభుత్వ భూమి ఎంతన్నది తేలితే, సమగ్ర సర్వేలో అందుకు తగ్గ వివరాలు ఏంటన్నవి తేలితే అప్పుడు ఎంఐజీ లే ఔట్ల ఏర్పాటు అన్నది సులువు అవుతుంది.