ఒకే కుటుంబంలో ఇద్దరూ ఒకేసారి గర్భందాల్చితేనే.. ఆ హడావిడి మూములుగా ఉండదు.. ఆఫీసులో అయినా అంతే..అలాంటిది ఒకే ఆఫీసులో, ఒకే విభాగంలో పనిచేసే మహిళల్లో ఏకంగా 11 మంది ఒకేసారి ప్రగ్నెంట్ అయితే.. ఇంకా హైలెట్ ఏంటంటే.. వీరికి డెలివరీ డేట్స్ కూడా దాదాపు ఒకే ఏరియాలో ఉన్నాయట. చిన్న విషయంలా అనిపిస్తుందా.. కానీ గమ్మత్తైన విషయమే కదా.. వాళ్లంతా కలిసి దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
అమెరికా మిస్సౌరీలోని లిబర్టీ ఆస్పత్రిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది ఆ ఆస్పత్రి స్టాఫ్ ఇప్పుడు గర్భిణులుగా ఉన్నారు. నెలల వ్యవధిలోనే వీరంతా తమ బిడ్డలకు జన్మనివ్వబోతున్నారు. వీరిలో 10 మంది నర్సులు, ఒక డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో పనిచేస్తోన్న వీరంతా నెలలు నిండుతున్నా రెట్టింపు ఉత్సాహంతో విధులకు హాజరవుతుండటం విశేషం.
వీరిలో ఒక నర్సు డెలివరీ డేట్ మే 27న ఉండగా, మిగతా వారంతా జులై-నవంబర్ మధ్యలో తమ పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. అంతేకాదు.. మిగతా పది మందిలో ఇద్దరి డెలివరీ డేట్ కూడా ఒకటే కావడం విశేషం. అయితే ఇలా ఒకే చోట ఇంత మంది గర్భం ధరించడం చాలా అరుదు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడం, వీరంతా గర్భంతో దిగిన ఫొటోను ఆస్పత్రి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు…
2018లో అమెరికా అండర్సన్ హాస్పిటల్‌లోని ప్రసూతి విభాగంలో ఒకేసారి 8 మంది మహిళా స్టాఫ్ గర్భం ధరించి ప్రత్యేకంగా నిలిచారు.
యూఎస్ పోర్ట్‌ల్యాండ్‌లోని ‘Maine Medical Center’ లో 2019లో తొమ్మిది మంది నర్సులు ఒకేసారి గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. ఒకరి డెలివరీ సమయంలో మిగతా వాళ్లంతా విధుల్లో కొనసాగుతూ.. వాళ్ల ప్రసవాల్నీ ఓ వేడుకలా చేసుకున్నారు.
2019లో ఒహాయో లోని ‘మియామీ వ్యాలీ ఆస్పత్రి’లో ప్రసూతి, డెలివరీ విభాగాలకు చెందిన 11 మంది నర్సులు ఒకేసారి గర్భం ధరించిన విషయం అప్పట్లో వైరల్‌గా మారింది.