కరోనా మహమ్మారితో భయాందోళనకు గురవుతున్న అమెరికాలో మంకీపాక్స్ కూడా వ్యాప్తి చెందుతోంది. అయితే తాజాగా అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ధృవీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు.
కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్ వైరస్ కేసుగా భావిస్తున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలతో అస్వస్థత ప్రారంభం అవుతుంది. జ్వరం, వళ్లు నొప్పులు, శరీరంపై అమ్మవారు మచ్చలు వ్యాపిస్తాయి. కెనడాలోని మాంట్రియల్‌లో ఆరోగ్యశాఖ అధికారులు 13 మంకీపాక్స్ కేసులను విచారిస్తున్నారు. శరీర ద్రవాలు కలవడం వల్ల మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తి శరీరాన్ని తాకినా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దుస్తులు వేసుకున్నాఆ వైరస్ ప్రబలే ఛాన్సు ఉంది. అంతేకాకుండా.. ఇది సెక్స్ వర్కర్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.