అడవి నిబద్ధాక్షరి.. వెన్నెల ( విరాట పర్వం సినిమాలో కనిపించే నాయకి) నిబద్ధాక్షరి.. ఇంకా చెప్పాలంటే కవితా ఝరి. మట్టిలో దాగిన చరిత్ర ఒక్క చోట నిక్షిప్తం అయిన జ్ఞాపకం.. ఈ రెండూ కాలం చెంత కరిగి ఓ శిలాక్షరి రూపాలుగా గోచరిస్తాయి. లేదా కనిపిస్తాయి. ఆ దృగ్గోచర కాంతిలో మనిషి .. ప్రేమను పొంది కాలాన్ని వెలివేస్తాడు. లేదా లోకాన్ని ఎదిరించి, లోపలి విశ్వాసాల ను జయిస్తాడు. నిరంతర ఘర్షణల్లో కల్లోలితాల్లో సంబంధిత ప్రతి చర్యల్లో ప్రతికారేచ్ఛలలో ప్రేమ వెన్నంటి నడిపేందుకు తోడుండే ప్రేరకం. ప్రేమ ప్రేరకం. ఒక్క మాటలో ఈ కథకు ప్రేమే ప్రేరకం..అని డైరెక్టర్ వేణు ఊడుగుల అంటున్నారు ఓ చోట.
రాయండి అది వికాస లక్షణం.. వెలివేతల కూడళ్లలో నిలబడి ప్రశ్నిస్తే అది వికాసం కాదు విప్లవం. విరుద్ధతలకు ఆనవాలుగా నిలిచే సందర్భాలను ప్రేమిస్తూ రాస్తే ఆ రాతకు ఓ గొప్ప జీవన నేపథ్యం తోడయి ఉంటే, కవిత్వం కానీ కథ కానీ ప్రత్యేక రీతికి చెంది ఉంటాయి. రాయడంలో చెడిన గుణం కన్నా మంచిని వెతకడం ఓ ప్రయోజన కారకం. ఆ విధంగా మంచి చెడుల కలబోత రాత, సినిమా రాత ఈ రెండూ ఉంటాయి. ఆ కూడళ్లలో విరాట పర్వం. ఈ సినిమా రాత మీకు నచ్చుతుంది. నచ్చేందుకు స్త్రీ ఔన్నత్యం చాటేందుకు అవసరం అయిన దృక్పథం ఈ కథలో ఉంది. తెచ్చిపెట్టుకున్న సంస్కారం అయితే ఇది కాదు.
పైకి కనిపించే సాత్వికుడు వేణు ఊడుగుల.. కనిపించని భావకుడు వేణు ఊడుగుల.. కవిత్వం, కథ వీటికి బానిసగా ఉంటాడు. విపరీతం అయిన చలం ప్రేమ కూడా ఉందని అనుకోవాలి. ఆ టోన్ ఈ సినిమాలో ఉండదు కానీ తనదైన నిజాయితీని మాత్రం నేరు మాటల్లో వినిపించే ప్రయత్నం నిరంతరం చేస్తుంటాడు. ఆత్మవంచనకు తావివ్వని రాతకు ప్రాధాన్యం ఇవ్వడం అతడి లక్షణం. సున్నితత్వం కథలో, కాల్పనిక సృష్టిలో కూడా ! సృజన సంబంధం అనుకునే ప్రతి ప్రయత్నంలో కొన్ని అప్రమేయాలు కూడా అతడి ప్రేమ పూర్వక కాంక్షలే ! అంతరంగ కల్లోలాలను బాగా ఇష్టపడే మనుషులు కొందరు మాత్రమే ఇలా తేలి మనకు ఈ ప్రపంచాన్ని అద్దంలో చూపించేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు యథార్థం..యథాతథ స్థితి..రంగుల లోకం అందించే అనుభూతి వాదం కన్నా గొప్పవి ! సినిమా వాటికి అతీతంగా ఉంటుంది..జీవితం వాటికి దగ్గరగా ఉంటుంది కానీ మనం వాటిని అంగీకరించం. కానీ విరాట పర్వం కొన్ని యథాతథ స్థితిగతులను, విప్లవ రీతులను, ప్రేమకు సంబంధించిన స్వేచ్ఛను, ఇంకా ఇంకొన్నింటిని పరిధి దాటని అనుభూతితోనే చెప్పి ఉంటుంది అన్నది ఓ భావన. ఈ భావనా స్రవంతికి ఈ కాల్పనిక సౌందర్యాలకు ఏమయినా కొత్త నిర్వచనాలు ఉన్నాయోమో వెతకాలిక !
విప్లవం నుంచి విప్లవం వరకూ తెలంగాణ నేలలకు నిక్షిప్తం అయిన చరిత్ర ఒకటి చిరపరిచితం అయి ఉంది. మనుషుల్లో అంతరాలు, అంతర్యుద్ధాలు వద్దనుకున్నాక చరిత్ర ఒట్టి తెల్ల కాగితాలతోనే ఉండిపోయి ఉంటుంది. అప్పుడు రేగే దుమ్ముకు కూడా విలువ ఉండదు. ఒక గాయం ఒక స్వాప్నిక ఛాయ కలిసి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలోనూ ఉద్యమాల అవసరాలు కొన్ని తప్పక గుర్తుకువస్తాయి. దేహం అంతా గాయాలతో నడిచిన వీరుల రక్త తర్పణం ఒకటి ప్రపంచ తప్పిదాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పటి కాలం అటువంటి వాటిని స్మరణకు తీసుకువస్తే ఉద్యమ రీతుల్లో ఉన్న గొప్పదనమో లేదా తప్పిదాలతో కూడుకున్న ప్రయాణమో ఏదో ఒకటి తప్పక గుండెను పలకరించి వెళ్తుంది. ఆ విధంగా విరాట పర్వం కొత్త గొంతుకలకు కొంత ఊరట ! నిన్నటి అలసిన అడవి బిడ్డకు దాహార్తి తీర్చే ఒక చెలమ కూడా !
ఈ సినిమా తప్పులతో ఉంది.. రాద్ధాంతం.. ఈ సినిమా ఒప్పులతో ఉంది సిద్ధాంతం.. సిద్ధాంతం ముందుకు తీసుకువెళ్లే ప్రయాణం ఒకటి చేశాక సైద్ధాంతికం. ఇది కదా ఇప్పుడు నడుస్తున్న చర్చ. విరాట పర్వం మూడేళ్ల కృషికి సంకేత రూపంగా రేపటి వేళ థియేటర్లకు రానుంది. సినిమా రూపకర్తలకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. ఈ సినిమా కథ, కథన రీతుల అన్నీ అన్నీ 90ల కాలం నుంచి ఇప్పటిదాకా మన మధ్య నడయాడినవే ! మనతో బంధం పెంచుకుని ఉన్నవే ! విప్లవాన్ని,అమరత్వాన్ని, త్యాగాన్ని సమర శీల గుణాన్ని అన్నింటినీ మనం మరిచి ఒక స్వేచ్ఛను మాత్రమే అయాచితంగా పొంది ఉండడం ఓ పెద్ద తప్పిదం. చారిత్రక తప్పిదం.
ఈ సినిమా మార్క్స్ సిద్ధాంతం నుంచి ఈ సినిమా రసానుభూతి నుంచి ఈ సినిమా రసానువాదం నుంచి ఈ చిత్రం అడవి నుంచి అడవి వరకూ ఉంటుందన్నది ఓ ఊహ.. ఓ కాల్పానిక ఛాయ అని రాయాలి. విరాట పర్వం సినిమాకు సంబంధించి ఇంతకు మించి ఇప్పుడున్న సమయాన చెప్పకూడదు. కవిత్వం రాసే వేణు ఊడుగుల జీవితాదర్శంను విపరీతంగా ఇష్టపడతారు అని అనుకుంటాను. జీవితాదర్శం ప్రేమలో ఉంది. కవిత్వం కన్నా ఆచరణలో ఉంది. జీవితాదర్శం అడవిలో ఉంది. వనాల నుంచి మేలుకున్న రాగ ఛాయల్లో ఉంది. ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పే ప్రయత్నం.. ప్రేమతోనే ఒక విప్లవ కాంక్షను వెల్లడించే తరుణం.. ఇవన్నీ ఓరుగల్లు నేలపై నిక్షిప్త జ్ఞాపకాలు అయి ఉన్నాయి. వాటి సడి వింటూ రాసిన కథ. నేరు విప్లవ జీవితాలను పలకరించే కథ. విప్లవంతో ప్రత్యక్ష పరిచయం ఉన్న వారికి ఒక చారిత్రక మరక ను తుడిచే ప్రయత్నం చేసే వారికి విరాట పర్వం విశిష్ట నేపథ్యం అన్నవి నచ్చి ఉంటాయి. తప్పక నచ్చుతాయి. మట్టిలో దాగి ఉన్న చైతన్యం అని రాస్తారే ! వాటికి అనుగుణంగా అనునయంగా ఈ సినిమా ఉండడం తథ్యం. డియర్ వేణూ సర్ ఆల్ ద బెస్ట్
– రత్నకిశోర్ శంభుమహంతి